Vitamin Deficiencies : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్స్, మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ తగిన మోతాదులో అందినప్పుడే శరీరం తన పనులను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వర్తించగలదు. అలాగే శరీరానికి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు తగిన మోతాదులో అందక పోవడం పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇలా ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడడం వల్ల శరీరంలో వివిధ భాగాలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాయి. శరీరానికి అందాల్సిన ముఖ్యమైన పోషకాలు ఏమిటి… అలాగే ఇవి లోపించడం వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో క్యాల్షియం మరియు విటమిన్ డి లోపం ఏర్పడడం వల్ల ఆస్ట్రియోపోరోసిస్ అనే తీవ్రమైన ఎముకల వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. ఎముకలు బలహీనంగా, గుళ్లగా మారతాయి. ఎముకలపై పగుళ్లు ఏర్పడతాయి. అలాగే క్యాల్షియం లోపించడం వల్ల రికెట్స్ అనే వ్యాధి బారిన కూడా పడాల్సి వస్తుంది.
ఈ వ్యాధిలో ఎముకలు ఊహించని విధంగా వంకరపోతాయి. ఇది క్రమంగా వైకాల్యానికి దారి తీసే అవకాశం ఉంది. అలాగే శరీరంలో అయోడిన్ లోపం వల్ల గోయిటర్ అనే సమస్య బారిన పడాల్సి వస్తుంది. ఇందులో థైరాయిడ్ గ్రంథి ఉబ్బి లావుగా మారుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా మందగిస్తుంది. దీంతో మనం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా శరీరంలో ఐరన్ లోపించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఐరన్ లోపించడం వల్ల అనీమియాతో పాటు నీరసం, బలహీనత, అలసట వంటి సమస్యలతో కూడా పోరాడాల్సి వస్తుంది. ఇక మన శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో థయామిన్ ( విటమిన్ బి1) కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల బెరిబెరి అనే సమస్య బారిన పడాల్సి వస్తుంది. ఈ విటమిన్ లోపించడం వల్ల కండరాలు బలహీనంగా తయారవుతాయి.
అదే విధంగా మన శరీరానికి విటమిన్ బి3 కూడా చాలా అవసరం. ఈ విటమిన్ లోపించడం వల్ల పెల్లాగ్రా అనే సమస్య తలెత్తుతుంది. చర్మంపై దద్దుర్లు, జీర్ణ సమస్యలు, మానసిక అవాంతరాలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విటమిన్ సి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ సి లోపించడం స్కర్వీ అనే సమస్య బారిన పడాల్సి వస్తుంది. చర్మంపై మచ్చలు, కీళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది. ఈ విధంగా ఈ పోషకాలు లోపించడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చాలా మందికి వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారనే విషయం కూడా తెలియదు. కనుక ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తగానే దానికి గల కారణాలను తెలుసుకోవాలి. అలాగే వీలైనంత వరకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.