అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది రక రకాలుగా శ్రమిస్తున్నారు. అయితే బరువును తగ్గించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన విధంగా పలు సూచనలు పాటిస్తే చాలు. దాంతో త్వరగా బరువును తగ్గించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. ఆఫీసుల్లో పనిచేసేవారు పై అంతస్తులో తమ డెస్క్ ఉంటే లిఫ్ట్‌ను కాకుండా మెట్లను ఉపయోగిస్తే మేలు. దీంతో ఎంతో కొంత శారీరక శ్రమ జరుగుతుంది. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అపార్ట్‌మెంట్లలో ఉండే వారు కూడా లిఫ్ట్‌లలో కూడా వీలైనంత వరకు మెట్లను ఉపయోగిస్తే శారీరక శ్రమ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
2. ఆఫీసుల్లో పనిచేసేవారికి ఇంటర్‌కామ్ సదుపాయం ఉంటుంది. దీంతో వారు చిన్న పని కోసం కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా సహ ఉద్యోగుల వద్దకు నడిచి వెళ్లండి. ఇది కొంత శారీరక శ్రమను కలిగిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
3. మీ ఇంటి దగ్గర్లో ఉన్న షాపులకు కూడా వాహనాలను వేసుకుని వెళ్లకండి. నడుచుకుంటూ వెళ్లండి. లేదా సైకిల్ ఉపయోగించండి. దీంతో కొంత శారీరక శ్రమ జరుగుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
4. వారంలో ఒక రోజు ఇంట్లో పనిచేసే అలవాటు చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయడం, తోట పనిచేయడం, ఇంట్లో దుమ్ము, ధూళి దులపడం వంటి చిన్న చిన్న ఇంటి పనులు చేయాలి. దీని వల్ల శారీరక శ్రమ జరుగుతుంది. దీన్ని అలవాటుగా చేసుకుంటే ఎప్పటికప్పుడు శరీరం శ్రమకు గురవుతుంది. దీని వల్ల బరువు తగ్గవచ్చు.
5. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడే అలవాటు ఉన్నా లేదా ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చేవారు అయినా సరే నడుస్తూ ఫోన్‌లో మాట్లాడండి. దీంతో శారీరక శ్రమ జరిగి శరీరంలో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గవచ్చు.
6. ఇంటికి దగ్గర్లో పార్కు లేదా ఖాళీ స్థలం ఏదైనా ఉంటే సరదాగా రోజూ అలా బయటకు వచ్చి గడపండి. ఇది కూడా శారీరక శ్రమను కలిగిస్తుంది.
7. ఆఫీసులకు ప్రజా రవాణా అందుబాటులో ఉంటే వీలైనంత వరకు బస్సుల్లో వెళ్లేందుకు యత్నించండి. ఇది మీకు రవాణా చార్జిలను తగ్గించడమే కాదు, శారీరక శ్రమను కూడా కలిగిస్తుంది.
8. ఎప్పటికప్పుడు ఏ పని చేసేందుకు అయినా యాక్టివ్‌గా ఉండాలి. బద్దకం వీడాలి. మీ పని మీరు చేసుకునేందుకే యత్నించాలి. అవసరం అయిన ప్రతి చోటా నడిచేందుకు యత్నించాలి. దీని వల్ల శారీరక శ్రమ జరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గవచ్చు.