Ripen Banana : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. వీటిల్లో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. అరటి పండ్లలోని పొటాషియం, మెగ్నిషియం బీపీని నియంత్రిస్తాయి. దీని వల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
అరటి పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలోకి వస్తాయి. అయితే అరటి పండ్లు ఆకుపచ్చగా ఉంటే అవి ఇంకా పండలేదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అరటి పండ్లు తియ్యగా ఉండవు. అరటి పండ్లు గనక పసుపు రంగులో ఉంటే అవి పండినట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లు కాస్త తియ్యగా ఉంటాయి. ఇక అరటి పండ్లపై గోధుమ రంగు మచ్చలు గనక ఉంటే అలాంటి పండ్లు బాగా పండాయని అర్థం. ఇవి పసుపు రంగు అరటి పండ్ల కన్నా ఎంతో తియ్యగా ఉంటాయి. వీటిల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి.
పోషకాలు సమానంగానే ఉంటాయి..
అయితే పోషక విలువల ప్రకారం చూస్తే పసుపు రంగులో, గోధుమ రంగు మచ్చలతో ఉండే అరటి పండ్లలో సమానంగా పోషకాలు ఉంటాయి. కానీ చక్కెర మాత్రం గోధుమ రంగు మచ్చలు ఉన్న పండ్లలోనే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాగా పండిన అరటి పండ్లను షుగర్ ఉన్నవారు తినకూడదు. తింటే షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు పసుపు రంగు అరటి పండ్లను తినవచ్చు. కానీ రోజుకు ఒక పండుకు మించి తినకూడదు.
ఇక బాగా మగ్గిన అరటి పండ్లను తినేందుకు కొందరు వెనుకడుగు వేస్తుంటారు. వీటిని తినాలా, వద్దా అని సందేహిస్తుంటారు. అయితే ఇందుకు డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా మగ్గిన అరటి పండ్లను తినవచ్చు. కానీ తినేముందు వాటిని ఒకసారి పరిశీలించండి.బాగా మగ్గిన అరటి పండ్ల తొక్క మరీ నలుపు రంగులోకి మారితే అలాంటి పండ్లను తినకూడదు. తింటే ఫుడ్ పాయిజనింగ్ అయి విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బాగా మగ్గిన అరటి పండు కుళ్లిపోయే దశలో దాని నుంచి ద్రవాలు లీక్ అవుతుంటాయి. ఇలా గనక అరటి పండు ఉంటే దాన్ని తినకండి. అలాగే అరటి పండు లోపల గుజ్జు మీద నల్లని ఫంగస్ మచ్చలు ఉన్నాయో లేదో చూడండి. ఉంటే తినకండి.
అలర్జీలు ఉన్నవారు తినకూడదు..
ఇలా బాగా మగ్గిన అరటి పండ్లను పరిశీలించి మరీ తినాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఒక మోస్తరుగా మగ్గిన అరటి పండ్లపై పైన తెలిపిన లాంటి లక్షణాలు కనిపించవు. కనుక అలాంటి పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే బాగా మగ్గిన అరటి పండ్లు కొందరికి పడవు. అవి వారిలో అలర్జీలు, వికారం, వాంతులను కలగజేస్తాయి. కనుక అలాంటి వారు మగ్గిన అరటి పండ్లను తినకూడదు.