Curd : పెరుగులో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. పెరుగు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ 100 నుంచి 200 గ్రాముల మేర పెరుగును తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పెరుగును అధికంగా తింటే జీర్ణవ్యవస్థలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే బరువు పెరుగుతారు. పాల ఉత్పత్తుల వల్ల అలర్జీ ఉన్నవారికి కూడా పెరుగు అంటే పడదు.
పెరుగును తినడం వల్ల మనకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది ప్రొబయోటిక్స్ ఫుడ్స్ జాబితాకు చెందుతుంది. అందువల్ల పెరుగును రోజూ తింటే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రోజూ భోజనం చివర్లో పెరుగు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చివర్లో పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
భోజనం చివర్లో పెరుగు తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. అయితే పెరుగును రాత్రి పూట భోజనం చివర్లో తింటే కొందరికి మ్యూకస్ పెరిగే చాన్స్ ఉంది. కనుక అలాంటి వారు పగటి పూట పెరుగు తింటే మంచిది.