Papaya : బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా సరే సులభంగానే లభిస్తాయి. చాలా మంది ఇళ్లలోనూ బొప్పాయి చెట్లను పెంచుతుంటారు. దీంతో వారికి ఈ పండ్లకు కొదువ ఉండదు. ఇక ఈ పండ్లు పెద్ద ఖరీదు కూడా ఏమీ ఉండవు. కానీ కొందరు బొప్పాయి పండ్లను తినేందుకు అంతగా ఆసక్తి చూపరు. కానీ ఈ పండ్లను తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన అనంతరం ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను రోజూ తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విధంగా బొప్పాయి పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వస్తాయి. కానీ బొప్పాయి పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే గ్యాస్, మలబద్దకం కూడా ఉండవు. కనుక బొప్పాయి పండ్లను ఈ సీజన్‌లో తినడం అసలు మరిచిపోకూడదు. ఇక ఈ పండ్లలో విటమిన్లు ఎ, కె అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కడుతుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా ఆపవచ్చు.
బొప్పాయి పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి. జుట్టు పెరిగేందుకు కావల్సిన పోషణను అందిస్తాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తనాళాలను శుభ్ర పరుస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. చలికాలంలో మనకు హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బొప్పాయి పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ పండ్లను తినడం మరిచిపోకండి.