ఆల్కహాలు సేవించేటపుడు కొన్ని ఆహారపదార్ధాలు పక్కన తినరాదు. సాధారణంగా మనం తాగేటపుడు పక్కనే కొన్ని తిండిపదార్ధాలు తినేస్తూ వుంటాం. ఆల్కహాల్ తో ఏది తిన్నప్పటికి హానికరమే. కొంతమంది ఆల్కహాల్ తాగి కక్కేయడం చూస్తూ వుంటాం. దీనికి కారణం వీరు పక్కన తినేటటువంటి పదార్ధాలే. కనుక ఆల్కహాల్ తోపాటు తీసుకోరాని ఆహారాలేమిటో పరిశీలిద్దాం! కారంగా వుండే నూనె వస్తువులు: ఆల్కహాలు ఎసిడిటీ కలిగిస్తుంది. కనుక తాగిన తర్వాత ఎక్కువ నూనెలు వుండే పదార్ధాలు డిన్నర్ గా తీసుకోవద్దు. పొట్ట తాగిన ఆల్కహాల్ ను బ్యాలన్స్ చేస్తూ ఇతర పదార్ధాలు జీర్ణం చేయాలి కనుక తినేది చాలా లైట్ గా వుండాలి. కనుక తాగిన తర్వాత బిర్యాని వంటివి తినవద్దు.
పాల ఉత్పత్తులు: కొంతమంది ఆల్కహాలు తీసుకునేటపుడు జున్ను ముక్కలు తింటారు. కాని ఇది సరికాదు. ఛీజ్, బటర్, పాలు మొదలైనవి జీర్ణం కావటం కష్టం. ప్రత్యేకించి రాత్రివేళ వీటిని తినరాదు. దీనివలన అజీర్ణం, కడుపులో మంట వంటివి కలుగుతాయి. ఛీజ్ అధికంగా వుండే పిజ్జా, లేదా పాస్తా వంటివి కూడా తినరాదు. సాధారణంగా రెస్టరెంట్లలో ఆల్కహాలుకు పక్కన వేరు శెనగ లేదా జీడిపప్పు వంటివి ఆహారంగా పెడతారు. వారు వీటిని ఉచితంగా ఇచ్చినప్పటికి అవి ఆల్కహాలుతో పాటు సరి అయిన ఆహారం కాదు. వీటిలో అధికమైన కొల్లెస్టరాల్ వుండి మీ ఆకలి మందగిస్తుంది.
ఉప్పగా వుండే ఆహారాలు: చాలామంది సైడ్ డిష్ గా పొటాటో చిప్స్ తింటారు. కాని ఇవి కూడా తినరాదు. ఉప్పటి పదార్ధాలు దాహాన్ని పెంచి మరింత తాగేలా చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. స్వీట్లు: చాక్లెట్ల వంటి తీపి పదార్ధాలు మరింత మత్తును కలిగిస్తాయి. మరింత తాగేలా చేసి కంట్రోలు తప్పిస్తాయి. కనుక తాగేటపుడు స్వీట్లను అసలు ముట్టరాదు. సోడాలు లేదా ఇతర కూల్ డ్రింక్ లు: మీ డ్రింకులను సోడా లేదా ఇతర కూల్ డ్రింక్స్ తో కలపకండి. ఆల్కహాలు డీహైడ్రేషన్ కలిగిస్తే, ఈ డ్రింకులు దానిని అధికం చేస్తాయి. ఆల్కహాలు ప్లెయిన్ వాటర్ లేదా ఐస్ తో కలుపవచ్చు లేదంటే, పండ్ల రసాలతో కలిపి తీసుకోవచ్చు. పక్కన ఈ తిండి పదార్ధాలను తప్పిస్తే, ఎప్పుడో ఒకసారి తీసుకునే ఆల్కహాలు మీకు హాని కలిగించకపోవచ్చు.