ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మనకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. కానీ మనం మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆహారం విషయంలో సరైన నియమాలను పాటించడం లేదు. వేళ తప్పించి భోజనం చేస్తున్నాం. అయితే ఎప్పుడో ఒకసారి వేళ తప్పి భోజనం చేస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ రోజూ సమయానికి భోజనం చేయని వారు మాత్రం కచ్చితంగా ఆ అలవాటును మానుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. లేదంటే అనేక సమస్యలు వస్తాయి. ఆకలి వేస్తున్నా వేళకు భోజనం చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేళకు భోజనం చేయకపోయినా, బాగా ఆకలిగా ఉన్నప్పుడు చాలా సేపు ఆగి భోజనం చేసినా.. అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యవంతుల్లో అయితే షుగర్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఏకాగ్రతను కోల్పోతారు. నేరుగా ఆలోచించలేరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేయదు. మెదడు ఎక్కువగా గ్లూకోజ్ మీద ఆధార పడుతుంది కనుక శరీరంలో తగినతం గ్లూకోజ్ లేకపోతే మెదడు సిగ్నల్స్ ఇస్తుంది. దీంతో పని మీద ధ్యాస ఉండదు. దేనిపై కూడా ఏకాగ్రత పెట్టలేరు. సరిగ్గా ఆలోచించలేరు. ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది.
ఆకలిగా ఉన్నప్పుడు లేదా వేళకు భోజనం చేయకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. దీంతో తరువాత ఎప్పుడు భోజనం చేసినా మనకు తెలియకుండానే ఎక్కువగా ఆహారం తింటాం. ఇలా రోజూ చేస్తే అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక వేళకు భోజనం చేస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది.
వేళకు భోజనం చేయకపోతే శరీర మెటబాలిజం తగ్గుతుంది. దీని వల్ల క్యాలరీలు త్వరగా ఖర్చు కావు. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. అధిక బరువు తగ్గడం కష్టమవుతుంది. బరువు పెరుగుతారు.
వేళకు భోజనం చేయని వారు జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక వేళకు భోజనం చేయాలి.
ఆకలిగా ఉంటే వెంటనే భోజనం చేయాలి. భోజనం చేయలేకపోతే పండ్లు లేదా నట్స్ వంటివి తీసుకోవాలి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా చూసుకోవచ్చు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. కనుక ఆకలిగా ఉంటే వెంటనే భోజనం చేయాలి. ఎక్కువ సేపు ఆగరాదు. అలాగే వేళకు భోజనం చేయలి. దీంతో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.