శారీరక ధారుఢ్యం కలిగి వుండటం మంచిదే. దీనివలన గుండెపోటు త్వరగా వచ్చే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. అయితే, శరీరం బలిష్టంగా వున్నవారికి గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం లేదని చెప్పాలి. శారీరక పటుత్వం కలిగి వుండాలంటే, మంచి ఆహారంతోపాటు సరి అయిన వ్యాయామాలు కూడా అవసరం. వ్యాయామం చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా కూడా వుంటుంది. సాధారణంగా లావుపాటి వ్యక్తులకే గుండెజబ్బులు వస్తాయనే అపోహలు చాలామందికి వుంటాయి.
అయితే సన్నగా వుండి సాధారణ ఆరోగ్యంతో వున్న వారికి కూడా గుండె జబ్బులు వస్తూనే వున్నాయి. దీనికి కారణం అంతర్గత కొవ్వు పేరుకోవడం వలన వీరి రక్తనాళాలు మూసుకుపోవటం కావచ్చు లేదా కొల్లెస్టరాల్ డిపాజిట్లు అధికం కావడం కావచ్చు లేదా రక్తనాళాలు పగిలిపోవటం కావచ్చు అంటున్నారు ఆధునిక పరిశోధకులు.
శారీరక ఫిట్ నెస్ ఏ రకంగా వున్నప్పటికి, వ్యక్తికిగల ఇతర కారణాలు అంటే డయాబెటీస్ కలిగి వుండటం, పొగతాగే అలవాటు, లేదా టొబాకో నమలటం, వంశపారంపర్యంగా గుండెజబ్బు కలిగి వుండటం, అధికమైన కొల్లస్టరాల్ లేదా హైపర్ టెన్షన్ లాంటివి గుండెజబ్బు అన్ని రకాల శరీరాల వారికి వస్తాయి. కనుక ఏ మాత్రం ఛాతీ నొప్పి లక్షణాలు కనిపించినా సత్వరమే సరిఅయిన రోగ నిర్ధారణకై వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.