రాత్రి పూట చాలా మంది సహజంగానే అతిగా భోజనం చేస్తుంటారు. కొందరు కాఫీలు, టీలు కూడా తాగుతుంటారు. ఆ సమయంలో పని నుంచి రిలీఫ్ ఉంటుంది కనుక ఒత్తిడి తగ్గేందుకు అలా చేస్తుంటారు. అయితే నిజానికి రాత్రి పూట కొన్ని రకాల ఆహారాలను తీసుకోరాదు. వాటి వల్ల దుష్పరిణామాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రాత్రి పూట తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
చిప్స్, వేపుళ్లు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలను రాత్రి పూట అస్సలు తినరాదు. తింటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. వాటిని జీర్ణం చేసేందుకు జీర్ణాశయం శ్రమిస్తుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరి పాదాలు వాపులకు గురవుతాయి. కనుక ఆ పదార్థాలను రాత్రి తినరాదు.
కారం, మసాలాలు ఉండే పదార్థాలను కూడా రాత్రి పూట తినరాదు. ఇవి కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి.
రాత్రి పూట స్వీట్లను తినరాదు. చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక అదంతా కొవ్వు కింద మారుతుంది. దీర్ఘకాలికంగా ఇలా చేస్తే అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రాత్రి పూట స్వీట్లను తినకూడదు.
కొందరు రాత్రి పూట టీ, కాఫీలను తాగుతుంటారు. నిద్రను ఆపుకునేందుకు అలా చేస్తారు. రాత్రి విధులు నిర్వర్తించే వారితోపాటు చదువుకునే స్టూడెంట్లు రాత్రి పూట టీ, కాఫీలను బాగా తాగుతుంటారు. కానీ అవి నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడో ఒకసారి అంటే ఫర్లేదు కానీ రోజూ అంటే నిద్రలేమి సమస్య వస్తుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.
రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించరాదు. లేదంటే నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫలితంగా డిప్రెషన్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి పూట మద్యం తీసుకోరాదు.