కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోషకాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాలలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ కలిపి ఒకేసారి తీసుకోవచ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్రభావాలు కలుగుతాయా ? అంటే..
ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాల కాంబినేషన్లను తీసుకోరాదు. అయితే నిజానికి కొందరికి కొన్ని ఫుడ్ కాంబినేషన్లు పడవు. కొందరికి పడతాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ శరీరానికి సరిపోయే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఉడకబెట్టిన గుడ్లు, పాలను తీసుకోవచ్చు. గుడ్లను తిన్నాక పాలు తాగవచ్చు. కాకపోతే రెండింటినీ తీసుకుంటే కొందరికి గ్యాస్ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంగా మారుతుంది. అలా గనక ఎవరికైనా సమస్య ఎదురైతే వారు ఇకపై ఆ రెండింటినీ కలిపి తీసుకోరాదు. అలా కాకుండా ఆ పాలు, గుడ్లను రెండింటినీ తిన్నాక కూడా ఎలాంటి సమస్యలు రాకపోతే నిరభ్యంతరంగా వారు ఆ రెండింటినీ ఒకేసారి తీసుకోవచ్చు. ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు.
అయితే బాడీ బిల్డింగ్, వ్యాయామం చేసేవారు పచ్చి కోడిగుడ్లను, పాలను ఒకేసారి తీసుకుంటారు. అలా చేయడం మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఆ గుడ్లను తిన్నప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పచ్చిగుడ్లకు బదులుగా ఉడికించిన గుడ్లను లేదా గుడ్లను ఆమ్లెట్ రూపంలో తినాలి. దీంతో ఎలాంటి సమస్య ఉండదు. అలా తిన్నాక పాలు తాగవచ్చు. కానీ పైన చెప్పిన విధంగా సమస్యలు ఎదురైతే మాత్రం ఆ రెండింటినీ కలిపి తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది.