శరీరంలో జరిగే జీవక్రియల్లో ఏదైనా లోపం ఉంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ (చక్కెర) మూత్రం ద్వారా బయటకు వస్తుంది. దీన్నే ఆయుర్వేదంలో “ప్రమేహం” అని అంటారు. దీన్ని మధుమేహం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిబారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులాగా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడతాయి. కొందరి మూత్రం చప్పగా కూడా ఉంటుంది. వీళ్లు అనేకసార్లు మూత్ర విస ర్జన చేయాల్సి వస్తుంది. దీన్నే అతి మూత్ర వ్యాధి అంటారు.
మధుమేహాన్ని తగ్గించుకోవడం సులభమే. అయితే అందుకు కఠిన నియమాలను పాటించాలి. మధుమేహాన్ని సమర్థవంతంగా అదుపుచేయటానికి ఆయుర్వేదంలో చేదు, వగరు, ఘాటు రుచులు ఉండే మూలికలు ఉంటాయి. వాటిని ఉపయోగించి మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోదుగ పువ్వులను ఎండబెట్టి చూర్ణం చేయాలి. రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ పువ్వుల చూర్ణం కలిపి ఒక కప్పు కషాయాన్ని మరిగించి వడబోసి ఉదయం పరగడపున, రాత్రి భోజనం ముందు తాగాలి. ఆకుల చూర్ణాన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చు. మోదుగపూల మిశ్రమం అతిమూత్రం, మధుమేహాల్ని అదుపుచేస్తుంది.
ప్రతి రోజూ పరగడుపున ముదిరిన పది కరి వేపాకు ఆకులు బాగా నమిలి మింగాలి. వంశపారంపర్యంగా వచ్చిన, ఊబకాయం వల్ల వచ్చిన మధుమేహ వ్యాధి అదుపులోకి వస్తుంది.
బాగా మొలకెత్తిన మెంతులను దోరగా వేయొంచి పిండి చేసి రోజూ ఒక టీ స్పూన్ ఉదయం,
రాత్రి భోజనం తర్వాత మజ్జిగతో పాటు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మద్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మోతాదులో మజ్జిగతో తీసుకోవాలి. మధుమేహం, అతిమూత్రం అదుపులోకి వస్తాయి.
ఉదయాన్నే రెండు టీ స్పూన్ల పొడపత్రి ఆకు చూర్ణంను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి.
మర్రి ఊడలను కొద్దిగా నలగ కొట్టి గ్లాసు నీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడపోసి తాగాలి.
ముదురు కాకరకాయలను గింజలతో సహా ఎండబెట్టి పొడిచేసి రోజూ ఉదయం, మద్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగలో కలిపి తాగాలి.
రెండు టీ స్పూన్ల ఉసిరిక పొడిని కప్పు కాకరకాయ రసంలో కలిపి రోజూ ఉదయం తాగాలి.
ప్రతి ఉదయం రెండు లేత మారేడు ఆకులు, రెండు లేత వేపాకులు కలిపి బాగా నమిలి మింగాలి.
వీటితోపాటు ముదిరిన కాకరకాయ గింజలు, కరివేపాకు, వేప పువ్వు లతో కారప్పొడులు చేసుకుని రోజూ భోజనంతో తినండి. ఊబకాయం ఉన్న వారు రాత్రి భోజనం మానేసి రెండు పుల్కాలు కానీ, చపాతీలు కానీ తీసుకోవడం మంచిది. ఆకు కూరలు, కాయగూరలు అన్నీ తినాలి.