చికున్ గున్యా అనేది ఒక వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి. ఏడిస్ ఏజిప్టి అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. దోమలు ఈ సీజన్‌లో విజృంభిస్తుంటాయి. కనుక ఈ సీజన్‌లో ఈ వ్యాధి బారిన చాలా మంది పడుతుంటారు.
చికున్ గున్యా వస్తే మొదట స్వల్పంగా లక్షణాలు ప్రారంభమై తరువాత సీరియస్ అవుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ఇవి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఈ లక్షణాలు కొందరిలో రోజుల తరబడి కనిపిస్తాయి. తరువాత నెమ్మదిగా తగ్గుతాయి. సాధారణంగా చికున్ గున్యాను కలగజేసే దోమ కుట్టిన తరువాత 4 నుంచి 12 రోజుల్లోగా లక్షణాలు కనిపిస్తాయి.
చికున్ గున్యా వ్యాధి మలేరియా, డెంగ్యూ అంత ప్రాణాంతకం కాదు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రతరం అవుతుంది. అందువల్ల ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి.
చికున్‌గున్యా బారిన పడిన వారు రోజూ పండ్లను తినాలి. పోషకాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ద్రవాలను ఎక్కువగా తాగాలి. దీంతో వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.
1. చికున్ గున్యా వచ్చిన వారికి కీళ్ల నొప్పులు, వాపులు ఉంటాయి కనుక వారు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి. అలాగే లవంగం నూనెను కూడా రాస్తుండాలి. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. వేడి నీళ్లను బకెట్ లో తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీని వల్ల రిలీఫ్ వస్తుంది. రోగ నిరోధ శక్తి పెరుగుతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి.
3. వేపాకులను పేస్ట్‌లా చేసి శరీరంపై మర్దనా చేసినట్లు మొత్తం రాయాలి. తరువాత కొంత సేపు ఉండి స్నానం చేయాలి. దీంతో ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.
4. చికున్ గున్యాను తగ్గించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. అందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. దీంతో వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.
5. పొద్దు తిరుగుడు విత్తనాలు, క్యారెట్లను తింటుండం వల్ల చికున్ గున్యా నుంచి వచ్చే లక్షణాలు తగ్గుతాయి. త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
6. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను పూటకు ఒక కప్పు చొప్పున 3 పూటలా తాగాలి. వ్యాధి నుంచి త్వరగా బయట పడవచ్చు.
7. చికున్ గున్యా వచ్చిన వారు డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కనుక కొబ్బరినీళ్లను తాగుతుండాలి. దీంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యం అవడంతోపాటు త్వరగా కోలుకుంటారు.