భోజనం చేసిన తరువాత సహజంగానే చాలా మందికి కడుపు ఉబ్బరం సమస్య వస్తుంటుంది. జీర్ణాశయం నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కొందరికి అసలు తినకపోయినా ఇలా అవుతుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. భోజనం చేసిన వెంటనే యాలకులను నమిలి మింగాలి. దీని వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది. జీర్ణాశయంలో ఉండే గ్యాస్ బయటకు పోతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అందువల్ల భోజనం చేసిన తరువాత ఒకటి లేదా రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలి మింగాలి.
2. జీర్ణ సమస్యలను తగ్గించడంలో తేనె బాగా పనిచేస్తుంది. భోజనం చేసిన వెంటనే 1-2 టీస్పూన్ల తేనెను తీసుకోవాలి. దీంతో గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి.
3. అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు భోజనం చేసిన వెంటనే వాటిని తినాలి. ఇలా చేస్తుంటే కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు.
4. ఒక టీస్పూన్ సోంపు గింజలు, ఒక టీస్పూన్ చక్కెరను కలిపి భోజనం అనంతరం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు.
5. భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా 10 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. దీంతో గ్యాస్ ఏర్పడకుండా నిరోధించవచ్చు. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
6. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడిగే గ్యాస్ లోపలికి పోతుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. కనుక భోజనం చేస్తున్నంత సేపు మాట్లాడకుండా ఉండడం మేలు.
7. కడుపు ఉబ్బరం ఉన్నవారు ఆ సమస్య తగ్గే వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ ను తీసుకోరాదు. టీ, కాఫీలు, మద్యం సేవించడం మానేయాలి. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.