సాధారణంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు, క్రీడలు ఆడినప్పుడు సహజంగానే ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గుతాయి. అయితే కొందరికి ఆ రకమైన పనులు చేసినప్పుడు కాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. అలాగే కొందరికి పోషకాహార లోపం, అసౌకర్యవంతమైన పాదరక్షలు ధరించడం, ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి కారణాల వల్ల కూడా పాదాల నొప్పులు వస్తుంటాయి. అయితే ఈ నొప్పులను కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాళ్లపై బాగా ఒత్తిడి పడినప్పుడు కాళ్ళలోని రక్తనాళాల్లో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో కూడా కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అయితే ఇందుకు గాను వేడి నీటిలో టవల్ ను ముంచి దాంతో కాపడం పెట్టాలి. సమస్య అదే అయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నొప్పి తగ్గేవరకు కాపడం పెడుతూనే ఉండాలి.
నీలగిరి తైలంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కాళ్లపై కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి. ఒక బకెట్ లో వేడి నీటిని పోసి అందులో కొద్దిగా నీలగిరి తైలం వేయాలి. అనంతరం అందులో కాళ్ళను ఉంచాలి. మోకాళ్ళ వరకు కాళ్ళను బకెట్ లో ముంచి ఉంచాలి. 15 నిమిషాల పాటు కాళ్ళను అలా ఉంచితే కాళ్ళ నొప్పులు తగ్గుతయి. తర్వాత కాళ్ళను బయటికి తీసి సాధారణ నీటితో కడుక్కోవాలి. దీంతో కాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే నొప్పి తగ్గకపోతే ఇంకోపూట కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది.
పైన చెప్పిన విధంగానే బకెట్ వేడి నీటిలో నీలగిరి తైలంకు బదులుగా ఒక టేబుల్ స్పూన్ ఎప్సం సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడాను వేయవచ్చు. అనంతరం ఆ నీటిలో కాళ్లను 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో ఎప్సం సాల్ట్ శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే బేకింగ్ సోడాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కాళ్ల వాపులను తగ్గిస్తాయి. దీంతోపాటు నొప్పి కూడా తగ్గుతుంది.
పైన తెలిపిన దాంట్లో నీలగిరి తైలంకు బదులుగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో కూడా కాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
నొప్పి ఉన్న ప్రదేశంపై మంచు ముక్కలు ఉండే ఐస్ ప్యాక్ ను పెట్టాలి. కొద్ది నిమిషాల పాటు మర్దనా చేసినట్లు ఐస్ ప్యాక్‌ను రాయాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. కాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పుదీనా ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల కూడా కాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
రెండు గ్లాసుల నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.
విటమిన్ డి లోపం ఉన్నా కండరాలు నొప్పులకు గురవుతుంటాయి. కనుక విటమిన్ డి ఉండే చేపలు, మాంసం, కోడిగుడ్డ పచ్చ సొన, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు, సోయా మిల్క్, ఓట్ మీల్ వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే నిత్యం ఉదయాన్నే కొంత సేపు సూర్యరశ్మిలో నిలబడాలి. దీంతో కూడా మనకు విటమిన్ డి అందుతుంది. ఈ విధంగా విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఫలితంగా కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి.