కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలకు చెందిన టీకాలను రెండు డోసుల్లో ఇస్తున్నారు. కొన్ని కంపెనీల టీకాలను మాత్రం కేవలం సింగిల్ డోస్ మాత్రమే ఇస్తున్నారు. ఇక కొందరికి రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన డోసులను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
అయితే కోవిడ్ టీకాలు రెండు డోసులు చాలవని, పూర్తి స్థాయిలో రక్షణ లభించాలంటే మూడో డోసు కూడా వేయాల్సిందేనని అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ రెండు డోసుల కన్నా మూడో డోసు వేస్తేనే ఆ వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని అన్నారు. అందువల్ల రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీలు ఫైజర్, బయోఎన్‌టెక్, మోడెర్నాలు ఇప్పటికే కోవిడ్ మూడో డోసును కొందరికి ఇస్తున్నాయి. అవయవమార్పిడి చేయించుకున్న వారికి మూడో డోసు కోవిడ్ టీకాలను ఇస్తున్నారు. అయితే రెండో డోసు వేసుకున్న తరువాత 6 నుంచి 8 నెలల లోపు మూడో డోసు తీసుకుంటే పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని ఆయా కంపెనీలు కూడా అభిప్రాయపడ్డాయి. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
సెప్టెంబర్ నుంచి అమెరికాలో మూడో డోసు టీకాలను ఇచ్చేందుకు ఇది వరకే రంగం సిద్ధం చేశారు. కానీ యూఎస్ ఎఫ్డీఏ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దీంతో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై మన దేశ సైంటిస్టులు స్పందించాల్సి ఉంది.