మన శరీరంలో లివర్ అతి పెద్ద అవయవం. ఇది అనేక రకాల జీవక్రియలను, పనులను నిర్వర్తిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతోపాటు శరీరానికి శక్తిని అందివ్వడం, పోషకాలను గ్రహించడం చేస్తుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే లివర్ లో పలు కారణాల వల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది రెండు రకాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మద్యం సేవించడం వల్ల ఎక్కువగా వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పలు ఇతర కారణాల వల్ల వస్తుంది.
ఈ వ్యాధి వంశ పారంపర్యంగా రావచ్చు. కామెర్లు సోకిన వారిలో, మద్యం ఎక్కువగా సేవించే వారిలో, పొగ తాగే వారిలో, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో, అధికంగా బరువు ఉన్నవారు, డయాబెటిస్, హైబీపీ సమస్యలు ఉన్నవారు, హైపో థైరాయిడిజం ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
ఫ్యాటీ లివర్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు
- ఆకలి లేకపోవడం
- బరువు తగ్గడం
- నీరసం, అలసట
- ముక్కు నుంచి రక్తం కారడం
- చర్మంపై దురదలు
- చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం
- కడుపునొప్పి, వాపులు, పాదాల వాపులు
- పురుషుల్లో స్త్రీలలా ఛాతి పెరగడం, కంగారు, ఆందోళన
ఈ లక్షణాలు కనిపిస్తే దాన్ని ఫ్యాటీ లివర్ సమస్యగా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే మందులను వాడాలి. అలాగే పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
* మన శరీరంలో లివర్ కుడి వైపు ఉంటుంది కనుక నిద్రించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. దీంతో లివర్‌పై ఒత్తిడి పడదు. గ్యాస్ సమస్య కూడా రాదు.
* రోజూ ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్ వ్యాధులు తగ్గుతాయి.
* రోజూ పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటున్నా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం పలుచని మజ్జిగను తాగుతుంటే మేలు చేస్తుంది.
* ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లను తాగితే మంచిది.
* నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, అతిగా ఆహారం తినడం, ప్యాక్ చేయబడిన ఆహారాలను తినడం, మాంసం ఎక్కువగా తినడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటివి మానుకోవాలి.
* భోజనం చేసిన అనంతరం 15 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. తిన్న తరువాత వేసే ఏకైక ఆసనం ఇదే. దీంతో లివర్, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడతాయి.
* భోజనం చేసిన తరువాత 15 నిమిషాల పాటు తేలిక పాటి వాకింగ్ చేస్తుండాలి.
ఈ జాగ్రత్తలను పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో మందులను వాడితే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.