Belly Fat : మన పోపు డబ్బాలో ఉండే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీనిని మనం రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. జీలకర్రను ఉపయోగించడం వల్ల వంటల రుచితోపాటు వాసన కూడా పెరుగుతుంది. కేవలం వంటల రుచిని పెంచడమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. రోజూ ఉదయం జీలకర్ర నీటిని తాగితే వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. అదే విధంగా మనం రోజూ తాగే టీలో లేదా గ్రీన్ టీ లో చిటికెడు జీలకర్ర పొడిని వేసి తీసుకున్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు జీలకర్ర పొడిని వేసి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయం శుభ్రపడుతుంది. మలబద్దకం సమస్య దూరం అవుతుంది. ఆకలి సరిగ్గా లేని వారు ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ నీటిని తాగడం వల్ల కడుపులో ఉండే పురుగులు కూడా నశిస్తాయి. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచే గుణం జీలకర్రకు ఉంది. జీలకర్రలో ఉండే పోషకాలు క్షీర గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. అదే విధంగా ఈ జీలకర్ర నీటిని తీసుకోవడంతోపాటు రోజూ వాకింగ్ చేయడం, పండ్లను మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా నీటిని తాగడం వంటివి దినచర్యలో భాగం చేసుకుంటే మీ వయసు వెనుకకు పరిగెడుతుంది. జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల మూత్రాశయ సమస్యలు దూరం అవుతాయి. మూత్ర పిండాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
జీలకర్ర నీటిని రోజూ తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడిన పుండ్లు, అల్సర్స్ వంటివి క్రమంగా తగ్గిపోతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు జీలకర్ర నీరు ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా జీలకర్ర నీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా ఉంటాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో పలు రకాల ఇన్ ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.
జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఉండే పూడికలు తొలగిపోతాయి. దీంతో మనకు గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కడుపులో వికారం, వాంతులతో బాధపడే వారు జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గు ముఖం పడతాయి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు నిద్ర త్వరగా పట్టేలా చేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల మనం నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల లేదా జీలకర్రను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
అదే విధంగా గ్లాస్ నీటిలో జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాల పాటు చేయడం వల్ల ఎంతటి బానపొట్టైనా తగ్గుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. జీలకర్ర నీటిని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఈ విధంగా జీలకర్ర నీరు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.