Immunity : వర్షాకాలం ముగిసింది. నిన్న మొన్నటి వరకు ఈ సీజన్‌కు చెందిన వ్యాధులతో సతమతం అయ్యాం. ఇక చలికాలం మొదలవుతోంది. ఈ కాలంలోనూ సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటుంది కనుక శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏయే హెర్బల్ టీలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తులసి, అశ్వగంధ టీ – ఈ టీ ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. తులసి, అశ్వగంధలలో ఔషధ గుణాలుంటాయి. కనుక కొన్ని తులసి ఆకులు, కొద్దిగా అశ్వగంధ పొడి వేసి మరిగించి అనంతరం వచ్చే టీని తాగితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. పుదీనా, అల్లం టీ – పుదీనా, అల్లం రెండింటిలోనూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుక ఈ రెండింటితోనూ టీ తయారు చేసుకుని తాగవచ్చు.
3. పసుపు టీ – పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల నీటిలో పసుపు వేసి మరిగించి దాన్ని హెర్బల్ టీలా తాగాలి. అందులో అల్లం, మిరియాలు కూడా వేయవచ్చు. మరిగాక అవసరం అనుకుంటే తేనె కూడా వేసి తాగవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. తేనె, నిమ్మ, అల్లం టీ – నీటిలో అల్లం వేసి మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
5. అల్లం, అతిమధురం టీ – అల్లం చిన్న ముక్క, అతి మధురం చూర్ణం వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీంతో గొంతు సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి.
ఈ సీజన్‌లో పైన చెప్పిన హెర్బల్ టీలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.