Faluda : వేసవి కాలంలో మనకు బయట ఎక్కడ చూసినా సోడాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు అధికంగా లభిస్తుంటాయి. ఇక వీటితోపాటు ఫలూదా కూడా లభిస్తుంది. ఇది వేసవి కాలంలో తాగాల్సిన పానీయాల్లో ఒకటి. దీన్ని తాగితే శరీరంలోని వేడి మొత్తం బయటకు పోతుంది. శరీరం చల్లగా మారుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేయాలి ? ఇంట్లో చేసుకోవచ్చా ? అని చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. కానీ కాస్త శ్రమిస్తే దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఫలూదాను ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫలూదా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 2 కప్పులు, స్ట్రాబెర్రీ జామ్ – అర కప్పు, రోజ్ సిరప్ లేదా రూఅఫ్జా – 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జా గింజలు – పావు కప్పు, ఉడికించిన సేమ్యా – పావు కప్పు, పిస్తాం, బాదం పప్పు తురుము – 2 టీస్పూన్ల చొప్పున, వెనిల్లా ఐస్‌క్రీమ్ – 4 స్కూప్స్, చక్కెర – రుచికి సరిపడా.
ఫలూదా తయారీ విధానం..
ఫలూదా తయారీకి రెండు గంటల ముందుగా జామ్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచుకోవాలి. తరువాత పాలను స్టవ్ మీద పెట్టి ఒకటిన్నర కప్పు అయ్యే వరకు మరిగించి చల్లార్చాలి. ఆ తరువాత చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ లేదా రూఅఫ్జా కలిపి పాలను బాగా గిలకొట్టి ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత గ్లాసులు తీసుకుని మొదట రోజ్ సిరప్ లేదా రూ అఫ్జా వేసి ఆపైన జామ్ ను కొద్దిగా చిదిమి వెయ్యాలి. ఆ తరువాత సేమ్యా, సబ్జా గింజలు వేసి గ్లాసుల్లో మూడొంతుల వరకు పాలు పోయాలి. చివరగా పైన ఐస్‌క్రీమ్, పిస్తాం, బాదం తురుము వేయాలి. దీంతో రుచికరమైన ఫలూదా రెడీ అవుతుంది. దీన్ని తాగితే శరీరంలోని వేడి మొత్తం పోయి చలువ చేస్తుంది.