Onion Tea : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది బీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడటం సర్వ సాధారణం అయిపోయింది. ముఖ్యంగా హై బీపీ అనేది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ఇది హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన జబ్బులకు దారి తీసే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ హైబీపీని హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ హై బ్లడ్ ప్రెషర్ ని అదుపు చేయడానికి ప్రజలు రోజూ ఎన్నో రకాల మందులను కూడా వాడుతూ ఉంటారు.
కానీ కేవలం మందుల వల్ల బీపీని పూర్తిగా కంట్రోల్ చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు రోజూ ఒక కప్పు ఉల్లిపాయలతో చేసిన టీని తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఫ్లేవనాల్స్, క్వర్సెటిన్ అనే ద్రవ్యాలు ఉంటాయి. ఇవి బీపీని అదుపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతే కాకుండా కొందరు వైద్యులు కూడా ఉల్లిపాయలు తీసుకోవడం లేదా ఉల్లిపాయలతో చేసిన టీ ని తాగడం వల్ల గుండె జబ్బులు మన దరిచేరవని సూచిస్తున్నారు.

ఇప్పుడు మనం ఉల్లిపాయలతో టీ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకొని అవి మరిగేంత వరకు వేడి చేయాలి. తరువాత ఆ నీటిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం బిర్యానీ ఆకులు వేసుకొని ఆ నీటిని మరి కాసేపు మరిగించాలి. అలా కాసేపు మరిగించాక నీటి రంగు చిక్కబడుతుంది. అప్పుడు కావాలంటే రుచి కోసం కొంచెం తేనె ఇంకా దాల్చిన చెక్క పొడిని ఆ నీటిలో కలుపుకోవాలి. ఒక నిమిషం తరువాత పొయ్యి మీద నుండి దించుకొని చల్లారిన తర్వాత ఆ నీళ్లని వడబోసుకోని కప్పులోకి తీసుకోవాలి.
ఇలా చేసుకున్న టీ ని రోజూ ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు గుండెకు కూడా మేలు జరుగుతుంది. అంతే కాకుండా మన శరీరానికి కూడా శక్తి లభించిన భావన కలుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ని అదుపు చేయడానికి క్రింద సూచించబడిన మరికొన్ని జాగ్రత్తలను అనుసరించవచ్చు.
రోజూ గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ని టెన్షన్ తగ్గి కండరాలు, నరాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి. మద్యం, పొగ త్రాగడం, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. చక్కెర, మైదా, ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. తగినంత నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం చేయాలి. ఇలా సూచనలు పాటిస్తే బీపీ తప్పక అదుపులోకి వస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.