Heat : మనలో అధిక వేడి సమస్యతో బాధపడే వారు చాలామందే ఉంటారు. ఈ సమస్య మనల్ని ఎక్కువగా వేసవి కాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ కొందరు కాలంతో సంబంధం లేకుండా శరీరంలో అధిక వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వల్ల, నీరు తక్కువగా తాగడం వల్ల, తరచూ ఆందోళనకు గురి అవ్వడం, థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అలాగే మన వయస్సు కూడా ఈ సమస్య రావడానికి కారణమవుతుంది.
శరీరంలో అధిక వేడి కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక సాధ్యమైనంత త్వరగా మనం మన శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సహజసిద్ధంగా మనకు లభించే పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో అధిక వేడిని తగ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా త్వరగా శరీరం చల్లబడి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉన్న వేడిని తగ్గించడంలో మనకు బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
బార్లీ గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. చెడు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేయడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. శరీరంలో వేడిని తగ్గించడానికి బార్లీని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ మోతాదులో బార్లీ గింజలను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి మరిగించాలి. నీరు మరిగిన తరువాత అందులో బార్లీ గింజల పొడిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో తేనె లేదా ఉప్పు, జీలకర్ర పొడిని వేసి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి వెంటనే తగ్గుతుంది. అంతేకాకుండా ఈ బార్లీ గింజల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అధిక వేడితో బాధపడే వారు ఈ విధంగా బార్లీ గింజలను తీసుకోవడం వల్ల వేడి తగ్గడంతోపాటు అధిక వేడి వల్ల వచ్చే ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం.