Barnyard Millet Khichdi : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన చిరు ధాన్యం వల్ల భిన్న రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుకనే అన్ని చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక చిరుధాన్యాల్లో ఒకటైన ఊదలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటినే బార్న్‌యార్డ్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఊదలను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్ ఉన్నవారికి ఊదలు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతోపాటు అనేక పోషకాలు కూడా ఊదల వల్ల మనకు లభిస్తాయి. అయితే ఊదలను నేరుగా తినడం ఇష్టం లేని వారు వాటితో కిచిడీని తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచికరం. పైగా ఆరోగ్యకరం కూడా. కనుక ఊదలతో కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊదల కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఊదలు – ఒక కప్పు, ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలు – అర కప్పు చొప్పున, టమాటా ముక్కలు – నాలుగైదు, నెయ్యి – రెండు పెద్ద టీస్పూన్లు, జీలకర్ర, అల్లం తరుగు – పావు టీస్పూన్ చొప్పున, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చి మిర్చి తరుగు – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత.
ఊదల కిచిడీని తయారు చేసే విధానం..
ఊదలను నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వేయాలి. ఇది కరిగాక జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, పచ్చి మిరపకాయల తరుగు, ఆలుగడ్డల ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. అందులోనే ఉప్పు వేసి కలపాలి. టమాటా ముక్కలను కూడా వేయాలి. తరువాత నానబెట్టిన ఊదల్ని వేసి సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌లో పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చేవరకు బాగా ఉడికించాలి. దీంతో ఊదల కిచిడీ తయారవుతుంది. గట్టిగా కావాలనుకుంటే నీళ్లను తక్కువ పోయాలి. దీంతో కిచిడీ గట్టిగా తయారవుతుంది. ఇలా ఊదలతో కిచిడీని తయారు చేసుకుని తింటుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.