Capsicum Rice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఇందులో మూడు రంగులవి ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది పసుపు. మూడు రంగుల క్యాప్సికంల ద్వారా మనకు భిన్న రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చ క్యాప్సికం విటమిన్ సిని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇక పసుపు రంగు క్యాప్సికంలో ఫోలేట్, రాగి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు, పురుషులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇలా ఒక్కో రంగు క్యాప్సికంతో మనం భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మూడింటినీ కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో మూడింటి ద్వారా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ మూడింటినీ కలిపి రైస్ రూపంలో వండి తింటే మనకు పోషకాలు.. రుచి.. ఆరోగ్యం.. మూడూ లభిస్తాయి. ఈ క్రమంలోనే క్యాప్సికమ్ రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికమ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం – ఒక్కొక్కటి చొప్పున, బియ్యం – ఒక కప్పు, ఉల్లిపాయ – ఒకటి (పెద్దది), పచ్చి మిర్చి – మూడు, నువ్వుల నూనె – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 5 లేదా 6, మిరియాలు – అర టీస్పూన్, జీడిపప్పు – 5, ఉప్పు – తగినంత, గరంమసాలా – అర టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, స్వీట్ కార్న్ – పావు కప్పు.
క్యాప్సికమ్ రైస్‌ను తయారు చేసే విధానం..
బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి కుక్కర్‌లో తీసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తీసుకోవాలి. జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు మిక్సీలో తీసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తని పేస్టులా చేసుకోవాలి. తరువాత క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. అవి వేగాక జీడిపప్పు మిశ్రమం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్‌లో పచ్చి వాసన పోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి. తరువాత గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి. దీంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా టమాటా చట్నీతో తినవచ్చు. భలే రుచిగా ఉంటుంది.