Beetroot Rice : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బీట్ రూట్ ఒకటి. బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బీట్ రూట్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన నాలుకతోపాటు మలం కూడా పింక్ రంగులోకి మారిపోతుంది. బీపీని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో బీట్ రూట్ సహాయపడుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. అయితే బీట్‌రూట్‌ను నేరుగా తినలేని వారు దీంతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇక బీట్‌రూట్ రైస్‌ను ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీట్ రూట్ – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నానబెట్టిన బియ్యం – 3 కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 2, మిరియాలు – అర టీ స్పూన్, లవంగాలు – 4, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క -2, యాలకులు – 4, తరిగిన పచ్చి మిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ -1 (పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పచ్చి బఠాని – అర కప్పు, తరిగిన పుదీనా ఆకులు – 5 లేదా 6, ఉప్పు – రుచికి సరిపపడా, నీళ్లు – నాలుగున్నర కప్పులు.
బీట్ రూట్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పచ్చి బఠాని, పుదీనా ఆకులు వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత బీట్ రూట్ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి నెమ్మదిగా రైస్ ను కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ రైస్ తయారవుతుంది. నేరుగా బీట్ రూట్ జ్యూస్ ను తాగలేని వారు.. బీట్‌రూట్‌ను తినలేని వారు.. ఇలా రైస్ గా చేసుకుని తినడం వల్ల కూడా.. బీట్ రూట్ లో ఉండే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.