Jonna Sangati : ప్రస్తుత కాలంలో చాలా మంది చిరు ధాన్యాలు, వాటితో తయారు చేసే ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మనకు లభించే చిరు ధాన్యాలలో జొన్నలు ఒకటి. ఫైబర్, ప్రోటీన్స్‌ను అధికంగా కలిగి ఉన్న వాటిల్లో జొన్నలు ఒకటి. అజీర్తి సమస్యను తగ్గించడంలో జొన్నలు ఎంతో సహాయపడతాయి. జొన్నలలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ ఉంటాయి. రక్త హీనతను తగ్గించి, ఎముకలను ధృడంగా చేయడంలో జొన్నలు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మనలో చాలా మంది జొన్నలతో చేసిన రొట్టెలను ఎక్కువగా తీసుకుంటున్నారు. పూర్వ కాలంలో జొన్నలతో సంగటిని చేసుకుని ఎక్కువగా తినేవారు. పూర్వ కాలంలోలాగా జొన్నల సంగటిని ఎలా తయారు చేసుకోవాలి, ఆ తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న సంగటి తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – రెండు కప్పులు, నీళ్లు – 6 కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, మజ్జిగ – ఒక గ్లాసు.
జొన్న సంగటి తయారీ విధానం..
ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. జొన్నలు నానిన తరువాత నీటిలో నుండి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఈ జొన్నలను వేసి నీళ్లు వేయకుండా మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక మందపాటి గిన్నెలో కానీ, కుక్కర్ లో కానీ ఒక కప్పు జొన్నలకు మూడు కప్పుల నీళ్ల చొప్పున, రెండు కప్పుల జొన్నలకు 6 కప్పుల నీళ్లను పోసుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత మెత్తగా చేసి పెట్టుకున్న జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటూ మరో సారి కలిపి, మూత పెట్టి, 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తరువాత మజ్జిగను పోసి బాగా కలిపి మూత పెట్టాలి. దీనిని మరో 5 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న సంగటి తయారవుతుంది. దీనిని ఏ కూరతోనైనా తినవచ్చు. వేసవి కాలంలో జొన్న సంగటిని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గడమే కాకుండా జొన్నల్లో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి.