Masala Sweet Corn : మనం ఆహారంలో భాగంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ ఈ స్వీట్ కార్న్ లో పుష్కలంగా ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో, గుండె జంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో ఈ స్వీట్ కార్న్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉడికించిన స్వీట్ కార్న్ ను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వివిధ రకాల వంటలల్లో కూడా ఈ స్వీట్ కార్న్ గింజలను మనం ఉపయోగిస్తాం. అంతేకాకుండా వీటితో నేరుగా కూడా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మసాలా స్వీట్ కార్న్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా స్వీట్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – 2 కప్పులు, నూనె – అర టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చాట్ మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర టేబుల్ స్పూన్.
మసాలా స్వీట్ కార్న్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో లేదా కళాయిలో తగినన్ని నీళ్లు పోసి అందులో స్వీట్ కార్న్ గింజలను వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత వాటిలో నీరు అంతా పోయేలా ఒక జల్లి గిన్నెలోకి లేదా జల్లి గరిటెలోకి తీసుకోవాలి. ఇప్పడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను వేసి బాగా కలిపి చివరగా చాట్ మసాలాను, కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత నిమ్మ రసాన్ని పిండి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా స్వీట్ కార్న్ తయారువుతుంది. సాయంత్రం సమయాలలో ఇలా మసాలా స్వీట్ కార్న్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.