Muskmelon Salad : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలను తీసుకుంటుంటారు. ఇక వేసవిలో మన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తర్బూజాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని వేసవిలోనే అధికంగా తింటుంటారు. ఇవి రుచికి చప్పగా ఉంటాయి. కనుక తర్బూజాలతో ఎక్కువగా జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. ఇక వీటితో సలాడ్ తయారు చేసి కూడా తినవచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. జ్యూస్ తాగలేమని అనుకునేవారు.. తర్బూజాలతో సలాడ్‌ను తయారు చేసి తినవచ్చు. ఇలా తిన్నా కూడా మనకు వీటితో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక తర్బూజాలతో సలాడ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తర్బూజా సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తర్బూజా – ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు – కొన్ని, నిమ్మరసం – పావు కప్పు, పచ్చి మిర్చి – 1, ఆవాల పేస్టు – ఒక టీస్పూన్, మిరియాలు – కొద్దిగా, చక్కెర – పావు కప్పు, ఉప్పు – తగినంత.
తర్బూజా సలాడ్ ను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి చక్కెర, నిమ్మరసం, పచ్చి మిర్చి వేసి మరిగించాలి. చల్లారిన తరువాత వడకట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్బూజా, బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పండ్ల ముక్కలపై ఫ్రిజ్‌లో పెట్టుకున్న మిశ్రమం పోయాలి. తరువాత ఆవాల పేస్టు, మిరియాల పొడి చల్లాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. చల్ల చల్లగా ఉన్నప్పుడే తింటే ఈ సలాడ్ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. పోషకాలు లభిస్తాయి.