పసుపు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని మనకు పెద్దలు చెబుతుంటారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తమ ఇళ్లలో పసుపును ఎక్కువగా వాడుతున్నారు. పసుపును వంటల్లో వేస్తుంటారు. దీంతో అనారోగ్య సమస్యలను నయం చేసుకుంటూ ఉంటారు. కొందరు పసుపు పాలలో కలుపుకుని తాగుతారు. అయితే అలా తాగలేం అనుకునే వారు పసుపుతో చట్నీ చేసుకుని తినవచ్చు. ఇలా తిన్నప్పటికీ అనేక లాభాలు కలుగుతాయి.
* పసుపు కొమ్ములు – 6 (పచ్చివి)
* వెల్లుల్లి రెబ్బలు – 4 లేదా 5
* ఎండు మిరపకాయలు – 2
* నల్ల జీలకర్ర – అర టీస్పూన్
* నూనె – 1 టీస్పూన్
* ఉప్పు – తగినంత
పసుపు కొమ్ములు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, నల్ల జీలకర్రలను కలిపి మిక్సీలో వేసి పట్టుకోవాలి. రోలులో కూడా వీటిని దంచుకోవచ్చు. దీంతో చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇక పాన్‌లో కొంత నూనె పోసి ముందు సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కలపాలి. మీడియం మంటపై నీరు పోయి డ్రైగా మారే వరకు వండాలి. అనంతరం మిశ్రమం గట్టిగా, పొడిగా మారుతుంది. దాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. వేడిగా ఉండగానే అన్నం లేదా రొట్టెలతో తినవచ్చు.
పసుపు చట్నీని నిత్యం తీసుకోవడం వల్ల పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనబడే పదార్థం శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. చలికాలంలో ఈ చట్నీని రోజూ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.