నిత్యం అన్ని రకాల కూరగాయలను తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ అన్ని కూరగాయలను తినలేరు కదా. అయితే దీనికి పరిష్కారం వెజిటబుల్ సలాడ్. అవును.. కూరగాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని కలిపి సలాడ్ రూపంలో తీసుకుంటే అన్ని కూరగాయలను తిన్నట్లు ఉంటుంది. దీంతోపాటు అన్ని కూరగాయల్లో ఉండే పోషకాలను నిత్యం పొందవచ్చు. మరి వెజిటబుల్ సలాడ్‌ను ఎలా తయారు చేయాలో, అందులో ఏమేం కూరగాయలను వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
వెజిటబుల్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు
* ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
* టమాటా ముక్కలు – అర కప్పు
* కీర దోసకాయ ముక్కలు – అర కప్పు
* క్యారెట్ ముక్కలు – అర కప్పు
* క్యాబేజీ తురుము – అర కప్పు
* ముల్లంగి ముక్కలు – అర కప్పు
* వెనిగర్ – 1 కప్పు
* తరిగిన కొత్తిమీర – 2 టీస్పూన్లు
* పచ్చి మిర్చి – 5
* ఉప్పు – రుచికి సరిపడా
* కరివేపాకు – తగినంత
వెజిటబుల్ సలాడ్‌ను తయారు చేసే విధానం
కొత్తిమీర, పచ్చిమిర్చిలను కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఓ బౌల్‌లో కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత పచ్చి మిర్చి, కొత్తిమీర ముద్దను వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. చివరగా వెనిగర్ వేసి కలపాలి. దీంతో వెజిటబుల్ సలాడ్ సిద్ధం అవుతుంది. దీన్ని నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే రోజుకు మనకు కావల్సిన పోషకాలు దాదాపుగా లభిస్తాయి. శక్తి అందుతుంది. చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉదయం తినలేం అనుకుంటే మధ్యాహ్నం భోజనంతోపాటు తీసుకోవచ్చు.