Weight Loss Laddu : రోజుకు ఒక్క లడ్డూను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగడమేంటి అని చాలా మంది సందేహపడుతుంటారు. కానీ ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. బరువు తగ్గుతారు. జుట్టు చక్కగా పెరుగుతుంది. ఈ లడ్డూను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది.
ఇవే కాకుండా ఈ లడ్డూను తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ లడ్డూ తయారీలో పంచదారను ఉపయోగించడం లేదు కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా దీనిని తినవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, అవిసె గింజలు – పావు కప్పు, గుమ్మడి గింజలు – 2 టేబుల్ స్పూన్స్, బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, యాలకులు – 3, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – పావు కప్పు, ఖర్జూర పండ్లు – ఒక కప్పు.
లడ్డూ తయారీ విధానం..
ముందుగా అడుగు భాగం మందంగా ఉండే ఒక కళాయిని తీసుకుని అందులో నువ్వులను వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా బెల్లం తురుము, ఖర్జూ పండ్లు తప్ప మిగిలిన పదార్థాలను ఒక దాని తరువాత ఒకటి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం తరుము, ఖర్జూర పండ్లు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి రుచితో ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలకు ఎండు కొబ్బరి పొడితో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. రోజుకు ఒక్క లడ్డూను తిన్నా కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.