వర్షాకాలంలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయి. దీంతో జలుబు, జ్వరం సహజంగానే వస్తుంటాయి. అలాగే సూక్ష్మ జీవుల వల్ల కూడా ఈ సీజన్‌లో ఇతర వ్యాధులు వస్తుంటాయి. దీంతో మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి. అయితే కింద తెలిపిన పలు మూలికలతో హెర్బల్ టీ లను తయారు చేసి రోజూ తాగుతుంటే దాంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే..
అల్లం
భారతీయులందరి ఇళ్లోనూ అల్లం సహజంగానే ఉంటుంది. ఇదొక వంట ఇంటి పదార్థం. ఇందులో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. అల్లంలో ఉండే విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లంలోని జింజరాల్ అనే సమ్మేళనం వ్యాధులను రాకుండా చూస్తుంది. అందువల్ల రోజూ నీటిలో అల్లం వేసి మరిగించి తాగుతుండాలి. దీని వల్ల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అతి మధురం
జలుబు, దగ్గులను తగ్గించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అతి మధురం చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్‌ను ఇది పటిష్టంగా మారుస్తుంది. ప్లీహంను తగ్గిస్తుంది. ఛాతి పట్టేయడం, దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. సూక్ష్మ జీవులు, కాలుష్య కారకాల నుంచి రక్షణను అందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అతి మధురంలో ఉండే సమ్మేళనాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఈ చూర్ణంతో రోజూ హెర్బల్ టీ తయారు చేసుకుని తాగితే ఎంతగానో మేలు జరుగుతుంది.
తులసి
దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కలు ఉంటాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. తులసి ఆకుల్లో ఫైటో కెమికల్స్, బయో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులైన జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అందువల్ల రోజు తులసి ఆకులను నీటిలో మరిగించి తాగుతుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
బ్రహ్మి
భూమి మీద ఎక్కువగా ఈ మొక్క విస్తరించి మరీ పెరుగుతుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులపై పోరాటం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. బ్రహ్మి ఆకులు లేదా చూర్ణంతో హెర్బల్ టీ తయారు చేసుకుని తాగితే మంచిది.