ఆయుర్వేదంలో శతావరిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం శతావరిని ఉపయోగించడం వల్ల స్త్రీలు, పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పురుషులకు శతావరి ఎంతగానో మేలు చేస్తుంది.
శతావరిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
శతావరి చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. దీని వల్ల వాత, పిత్త దోషాలు సమతుల్యం అవుతాయి. శతావరి శరీరంపై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది.
శతావరి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మహిళలకు పీరియడ్స్ సమయంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
శతావరి మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, విసుగు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర చక్కగా పడుతుంది.
రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవారు శతావరిని తీసుకోవడం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
శతావరిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది.