Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల మందులు, మాత్రలను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు.
అయితే ఈ సీజన్‌లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. చలికాలంలో సహజంగానే వచ్చే అనేక శ్వాసకోశ సమస్యలను అల్లంతో తగ్గించుకోవచ్చు.
* ప్రతి రోజూ కొద్ది పరిమాణంలో అల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు సమస్యలు దూరమవుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొద్దిగా అల్లం రసం తాగాలి. 1 లేదా 2 టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత అల్లం వేసి మరిగించిన నీటిని కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు నయం అవుతాయి.
* చలికాలంలో తలెత్తే జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడానికి అల్లం ఎంతో దోహదపడుతుంది. ప్రతి రోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆకలిని ప్రేరేపిస్తుంది. దీంతో ఆకలి బాగా అవుతుంది. అజీర్ణ సమస్య ఏర్పడకుండా చూసుకోవచ్చు.
* చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. ఇలా బరువు సమస్యతో బాధపడేవారు రెండు అల్లం ముక్కలను వేడి నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గవచ్చు.
* ప్రస్తుత కాలంలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం అయ్యింది. ఇలా మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళు కరిగిపోవాలంటే అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి సమయంలో కొద్దిగా గోరువెచ్చని నీటిలో అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.