Thippatheega : ప్రకృతి మనకు అందించిన ఔషధ మొక్కలల్లో తిప్ప తీగ కూడా ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల గట్ల మీద, పొదలకు అల్లుకుని తిప్ప తీగ పెరుగుతూ ఉంటుంది. తిప్ప తీగలో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఈ మధ్యకాలంలో చాలా ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది తిప్ప తీగ జ్యూస్ తాగడం మొదలు పెట్టారు. అయితే తిప్పతీగలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి.. తిప్ప తీగ జ్యూస్ ను తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిప్పతీగలో 35 రకాల ఫైటో కెమికల్స్ ఉన్నాయని నిపుణులు గుర్తించారు. ఈ 35 రకాల్లో 15 రకాల ఆల్కలాయిడ్స్, 6 రకాల గ్లైకోసైడ్స్, 5 డైటర్పినాయిడ్స్, 4 రకాల స్టిరాయిడ్స్, 5 రకాల ఆలీప్యాటిక్ కాంపౌడ్స్ ఉన్నాయని 2016 వ సంవత్సరంలో సెంట్రల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ నారోమ్యాటికల్ ప్లాంట్స్ లక్నో, ఇండియా కాలేజ్ వారు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
ముఖ్యంగా మన రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తిప్పతీగ మనకు ఎంతో సహాయపడుతుంది. మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్ లను కనిపెట్టే టి హెల్పర్ సెల్స్ ను పెంచడంలో తిప్పతీగ మనకు సహాయపడుతుంది. టి హెల్పర్ సెల్స్ పెరగడం వల్ల మన శరీరంలో ప్రవేశించిన వైరస్ లను టి కణాలు వెంటనే గుర్తిస్తాయి. అలాగే మన రక్తంలో మాక్రోఫేజ్ కణాలు రక్తంలో సంచరిస్తూ ఉంటాయి. ఇవి టి కణాలు ఇచ్చిన సమాచారంతో శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలను మింగి భస్మం చేస్తాయి. మాక్రోపేజ్ కణాల్లో లైసోజోమ్స్ ఉంటాయి. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లను భస్మం చేసే ప్రక్రియను ఈ లైసోజోమ్స్ కలిగి ఉంటాయి. తిప్పతీగ జ్యూస్ తాగడం వల్ల లైసోజోమ్స్ కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
దీంతో శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లు వెంట వెంటనే నశిస్తాయి. అలాగే వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లు మరలా రాకుండా మన శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. ఈ యాంటీ బాడీస్ ను బి సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. తిప్పతీగ జ్యూస్ తాగడం వల్ల బి సెల్స్ యాంటీ బాడీస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీంతో మన రక్షణ వ్యవస్థ మరింత ధృడంగా తయారవుతుంది. అదేవిధంగా ఊబకాయంతో బాధపడే వారిలో కణాలు ఎక్కువగా ఇన్ ప్లామేషన్ కు గురి అవుతాయి. వైరస్, బ్యాక్టీరియాలు వారిపై దాడి చేసినప్పుడు వారు మరింతగా ఇన్పెక్షన్ కు గురి అయ్యే అవకాశం ఉంది. తిప్పతీగ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఊబకాయం ఉన్నవారిలో ఇన్పెక్షన్ మరింత ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే మనం ఇన్పెక్షన్ బారిన పడినప్పుడు మన శరీరంలో టిఎన్ ఎఫ్ అల్పా వంటి కెమికల్స్ ఎక్కువగా విడుదల అవుతాయి.
ఈ కెమికల్స్ ఎక్కువగా విడుదల అవుతున్న కొద్దిమన శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి అవయవాలు దెబ్బతింటాయి. తిప్పతీగ జ్యూస్ ను తాగడం వల్ల దీనిలో ఉండే ఔషధ గుణాలు విడుదలైన కెమికల్స్ ను నిర్వీర్యం చేయడంతో పాటు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా తిప్పతీగ మనకు సహాయపడుతుంది. ఈ విధంగా మన రక్షణ వ్యవస్థపై తిప్పతీగ నేరుగా పని చేసి మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తిప్పతీగను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిప్పతీగ ఆకు మెత్తగా దంచి ముద్దగా చేసి నేరుగా మింగవచ్చు. అలాగే ఒక లీటర్ నీటిలో తిప్పతీగ ఆకులు వేసి సగం అయ్యే వరకు మరిగించి తరువాత వడకట్టి ఆ కషాయాన్ని తాగవచ్చు. అలాగే మనకు మార్కెట్ లో తిప్పతీగ పొడి, తిప్ప తీగ ఆకుల జ్యూస్ కూడా లభిస్తుంది. వీటిని తీసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా తిప్పతీగను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.