ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. దీంట్లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్, ఫైటో న్యూట్రియంట్స్, పాలీఫినాల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. పోషకాల కంటే వీటిలో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా దీన్ని మలబద్దక సమస్య నివారణకు వాడుతారు.
త్రిఫల చూర్ణాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నారనేది ముఖ్యం. అనుపాతంతో దీని గుణాలు మారుతుంటాయి. గోరు వెచ్చని లేదా చల్లని నీళ్లు, పాలు, తేనె.. ఇలా వివిధ రకాల ద్రవాలతో కలిపి తీసుకున్నప్పుడు ఫలితాలు మారుతుంటాయి. పెద్దవాళ్లు అర టీస్పూన్, చిన్న పిల్లలు పావు టీస్పూన్ చొప్పన తీసుకోవచ్చు.
– నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు పాలతో తీసుకోవాలి. పాలల్లో తేనె, నెయ్యితో ఈ చూర్ణాన్ని కలిపి తింటే కళ్లు, చర్మం, మెదడుకు మేలు చేస్తుంది.
– నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీళ్లో కలిపి తీసుకుంటే మలబద్దకం ఉండదు.
– అధిక బరువు ఉన్నవారు చల్లని నీళ్లతో తీసుకుంటే బరువు తగ్గుతారు. అర టీస్పూన్ చొప్పున రెండు పూటలా వాడాలి. ఇబ్బందులు వస్తే పావు టీస్పూన్ చొప్పున తీసుకోవాలి.
– మధుమేహం ఉన్నవారు నరాల సమస్యలను తగ్గించేందుకు, కాలేయం పనితీరును మెరుగుపరిచేందుకు ఈ చూర్ణాన్ని చల్లని నీటితో కలిపి అర టీస్పూన్ మోతాదులో వాడితే మంచిది.
– సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లు లేదా తేనెతో త్రిఫల చూర్ణాన్ని కలిపి వాడుకోవాలి.
– నోటిపూత, చిగుళ్లవాపులు వచ్చినవారు గోరు వెచ్చని నీటిలో ఈ చూర్ణాన్ని వేసుకుని పుక్కిలించాలి.
– వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడే స్త్రీలు ఈ చూర్ణాన్ని నీళ్లలో వేసి మరిగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
– జుట్టు రాలిపోతుంటే కుంకుడు రసంలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి తలకు పట్టించాలి. తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
– జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ చూర్ణాన్ని శొంఠి, పిప్పళ్లు, మిరియాలతో కలిపి తీసుకోవాలి. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
– కడుపులో నులిపురుగులు ఉన్నవారు అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని వాముతో కలిపి తీసుకోవాలి.
– ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగను తీసుకోవచ్చు.