Tulsi And Turmeric : మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల బారిన పడడం, చెవి ఇన్ఫెక్షన్ లు, చర్మ సంబంధిత సమస్యలు, బ్రాంకైటీస్, సైనస్ వంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అలాగే శరీరంలో అంతర్గతంగా ఇన్ఫెక్షన్, ఇన్ ప్లామేషన్ తలెత్తడం, డయేరియా, కడుపులో నొప్పి వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అలాగే రక్తంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడం, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు, 5 లేదా 6 తులసి ఆకులు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని చిన్న మంటపై అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని ఒక గ్లాస్ లోకి వడకట్టుకుని తీసుకోవాలి. ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత దీనిలో రుచి కొరకు తేనెను కూడా వేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ 3 నుండి 4 టేబుల్ స్పూన్ల మోతాదులో పరగడుపున తీసుకోవాలి. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే పిల్లలకు దీనిని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.