వర్షాకాలం రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరాలు వస్తుంటాయి. అనేక రకాల సూక్ష్మ క్రిములు మన శరీరంపై దాడి చేస్తూ అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. అయితే ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా సురక్షితంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన 5 ఆయుర్వేద మూలికలను రోజూ ఉపయోగించాలి. వాటితో ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే..

అతి మధురం
దీన్నే హిందీలో ములేథి అని ఇంగ్లిష్‌లో లికరైస్ అని అంటారు. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో లివర్‌ను దృఢంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో అధి మధురం అద్భుతంగా పనిచేస్తుంది. ఛాతి పట్టేయడం, జలుబు, దగ్గు తగ్గుతాయి. మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతి మధురం చూర్ణంను రోజూ వాడడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో టీస్పూన్ అతి మధురం చూర్ణాన్ని కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవచ్చు. దీంతో ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండవచ్చు.
బ్రాహ్మి
ఆయుర్వేదంలో బ్రాహ్మికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులను రాకుండా చూస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది కూడా చూర్ణం రూపంలో లభిస్తుంది.

అల్లం
భారతీయులందరి ఇళ్లలోనూ అల్లం కచ్చితంగా ఉంటుంది. ఇది ఒక మూలిక. అయినప్పటికీ ఇందులో విటమిన్ బి6, ఇతర పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను రాకుండా చూస్తాయి. రోజూ పరగడుపునే అల్లం రసాన్ని 2 టీస్పూన్ల మేర తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

తులసి
తులసి మొక్కలు చాలా మంది ఇళ్లలో ఉంటాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి, జింక్ ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఫైటో కెమికల్స్, బయో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ దగ్గు, జలుబు వంటి అనేక రకాల సమస్యలను తగ్గిస్తాయి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి రోజూ ఉదయం, సాయంత్రం భోజనం చేశాక తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

యాలకులు
యాలకులను అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటలతోపాటు స్వీట్లలో వేస్తుంటారు. ఇవి చక్కని వాసనను అందిస్తాయి. యాలకుల్లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. దీని వల్ల వైరస్‌లపై అది పోరాటం చేస్తుంది. అలాగే యాలకుల్లో ఇతర మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మనకు వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. కనుక యాలకులను రోజూ తింటే మంచిది. ఉదయం, సాయంత్రం భోజనం చేశాక ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
