Betel Leaves Plant : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇళ్లలో చిన్న ఖాళీ స్థలం ఉన్నా చాలు.. కుండీల్లో వివిధ రకాల మొక్కలను పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల అలంకరణ, కూరగాయలు, పండ్లు మొక్కలను పెంచుతున్నారు. ఇక చాలా మంది ఇళ్లలో తమలపాకుల మొక్కలను కూడా పెంచుతుంటారు. తమలపాకుల మొక్కలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడమే కాదు.. ఆధ్యాత్మిక పరంగానూ ఇవి ఉపయోగపడతాయి. తమలపాకుల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, అనుకున్నవి నెరవేరుతాయని, ధనం సమృద్ధిగా లభిస్తుందని నమ్ముతారు.
అందుకనే చాలా మంది తమలపాకుల మొక్కలను పెంచుతున్నారు. అయితే మొక్కలను అయితే పెంచుతారు కానీ.. అవి సరిగ్గా పెరగకపోతే విచారిస్తుంటారు. కానీ ఈ చిట్కాలను పాటించడం వల్ల తమలపాకు మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. ఆకులు విపరీతంగా వస్తాయి. బాగా పొడవుగా మొక్క పెరుగుతుంది. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
తమలపాకు మొక్క సరిగ్గా పెరగాలంటే దాని కాండం భాగానికి ఆరంభంలో నీళ్లు బాగా కావాలి. అందుకు గాను ఒక నిలువైన పొడవాటి ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకుని కుండీలో పాతాలి. దానికి చుట్టూ గోనె సంచిని చుట్టాలి. దానికి మొక్కను అల్లింపజేయాలి. తరువాత మీద నుంచి నీళ్లను పోస్తూ ఉండాలి. దీంతో గోనె సంచి ఎల్లప్పుడూ తడిగా ఉంటుంది. ఫలితంగా మొక్కకు కావల్సిన నీళ్లు చాలా సేపు అందుతాయి. దీంతో మొక్క బాగా ఎదుగుతుంది.
ఇక తమలపాకు మొక్క బాగా పెరగాలంటే పలు పదార్థాలను ఎరువులుగా వేస్తుండాలి. ఒక లీటర్ నీటిలో ఒక చిన్న పాకెట్ కాఫీ పొడిని కలిపి ఆ నీళ్లను పోస్తుండాలి. అలాగే ఎప్సం సాల్ట్‌ను కూడా వేయాలి. దీంతోపాటు వేపనూనె, పులిసిన మజ్జిగ, వాడిన టీ పొడి.. ఇలా వీటిని ఎరువులుగా వేస్తుండాలి. దీంతో తమలపాకు మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎటు చూసినా ఆకులే కనిపిస్తాయి. పచ్చగా ఎదుగుతాయి. ఇలా తమలపాకు మొక్కను ఇంట్లో పెంచాల్సి ఉంటుంది.