Banana And Eggs : అరటిపండ్లు, కోడిగుడ్లు.. ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి..? ఆశ్చర్యంగా ఉందా..? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించవచ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడవచ్చు. దీంతో ఆ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మొక్కలను పెంచాలంటే మూడు అంశాలను ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. అవి చక్కని మట్టిలో గుంతలు తవ్వడం, సరైన ఎరువులు వాడడం, తగిన సమయానికి నీరు పోయడం తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడం, నీరు పోయడం ఎవరైనా శ్రద్ధతో చేస్తారు. కాకపోతే ఎరువుల విషయానికి వస్తేనే ఎటూ తేల్చుకోలేరు. అయితే డబ్బులు వెచ్చించి కృత్రిమ ఎరువులను వాడేందుకు ప్రస్తుతం ఎవరూ ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో మొక్కల పెంపకం కోసం సేంద్రీయ ఎరువుల ఆవశ్యకత ఏర్పడింది.
మిగతా సేంద్రీయ ఎరువుల కన్నా అరటిపండ్లు, కోడిగుడ్లు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా ఎరువులా వాడుకోవచ్చు. సాధారణంగా మొక్కలకు సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా అదే తరహా పోషకాలను మొక్కలకు అందిస్తాయి. అయితే వాటిని వాడాలంటే గుంతను కనీసం 10 నుంచి 12 ఇంచుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. బాగా పండిన అరటిపండ్లు, గడువు ముగిసిన కోడిగుడ్లను కూడా ఈ పద్ధతి కోసం ఉపయోగించవచ్చు. ఒక మొక్కకు ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు చొప్పున ఉంచాల్సి ఉంటుంది. అయితే వీటిని గుంతలో పక్క పక్కనే యథావిధిగా ఉంచాలి. వాటిని నుజ్జు నుజ్జు చేయడం, నలపడం వంటివి చేయకూడదు.
అనంతరం గుంతను సగానికి మట్టితో నింపాలి. మిగిలిన భాగంలో మొక్క వేర్లు వచ్చేలా పెట్టి మొత్తం గుంతను పూడ్చేయాలి. మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు కూడా పెరుగుతాయి. అయితే మొక్క వేర్లకు, దాని కింద ఉంచిన పదార్థాలకు దాదాపు 4,5 ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు ఆ గ్యాప్‌ను భర్తీ చేసి చివరిగా కింద ఉంచిన పదార్థాలను చేరుకుంటాయి. ఆ సమయంలో ఆ పదార్థాలు అధిక స్థాయిలో పోషకాలను విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో వేర్ల ద్వారా ఆ పోషకాలలోని శక్తి మొక్కకు చేరి మొక్క ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఇలా అరటి పండ్లు, కోడిగుడ్లను ఉపయోగించి మన ఇంటి పెరట్లో, లేదా బాల్కనీలో కుండీల్లో చిన్నపాటి మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. దీంతో కృత్రిమ ఎరువులను వాడాల్సిన పని ఉండదు. మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి.