ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక టీస్పూన్ అలోవెరా జెల్, 1/2 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ ఇన్‌స్టాంట్ ఓట్‌మీల్‌లను ఒక చిన్నపాత్రలో తీసుకుని పేస్ట్‌గా వచ్చే వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా కనిపించవు. యాంటీ ఏజింగ్ కారకంగా ఈ మిశ్రమం పనిచేస్తుంది.
కలబంద ఆకును తీసుకుని దాంట్లోని గుజ్జును సేకరించాలి. ఇలా సేకరించిన గుజ్జును ఒక పాత్రలో నిల్వ చేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ కొంత మొత్తంలో కలబంద గుజ్జును తీసి ముఖంపై సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. ఇలా చేస్తే ముఖం మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు మొటిమలతో బాధపడుతున్న వారు కూడా ఈ పద్ధతిని ట్రై చేయవచ్చు. ఒక టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జు, 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలపాలి. దీన్ని రాత్రిపూట ముఖంపై రాయాలి. ఉదయాన కడిగేయాలి. దీని వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మానికి ప్రకాశం చేకూరుతుంది. మచ్చల వంటివి తొలగిపోతాయి.
ఎండ కారణంగా కమిలిపోయిన చర్మంపై కలబంద గుజ్జును రాస్తే ఫలితం ఉంటుంది. ఇది వాపులను కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. కలబంద గుజ్జును గాయాలు, వాపులు, పురుగు కుట్టిన ప్రదేశాల్లో రాస్తే ఉపశమనం లభిస్తుంది. షేవింగ్ చేసుకున్న తరువాత కలబంద గుజ్జును ముఖానికి రాస్తే మంట, దురద తగ్గుతాయి. రెండు టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్, 1 టేబుల్‌స్పూన్ ఆముదంలను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టేలా తలపై బాగా మర్దనా చేస్తూ రాయాలి. రాత్రి పూట ఇలా చేసి దాన్ని అలాగే వదిలేయాలి. తెల్లారాక స్మూత్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. చర్మానికి కూడా రక్షణ లభిస్తుంది.
ఎల్లప్పుడూ జిడ్డుగా ఉండే కుదుళ్లు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఇన్‌ఫెక్షన్ల వంటివి కలిగినప్పుడు చుండ్రు ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఇలా అన్ని రకాల చుండ్రును కలబంద తగ్గిస్తుంది. దీంట్లో బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కృత్రిమ పదార్థాలు, రసాయనాలు ఎక్కువగా కలిపి తయారు చేసిన షాంపూలు, కండిషనర్లు వాడడం వల్ల జుట్టు పీహెచ్ విలువ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కలబంద గుజ్జు ఈ పీహెచ్ విలువను నియంత్రిస్తుంది. దీని వల్ల వెంట్రుకల సమస్యలు తగ్గిపోతాయి. వెంట్రుకలకు మృదుత్వాన్ని అందించే గుణాలు అలోవెరాలో ఉన్నాయి. షాంపూతో తలస్నానం చేశాక కొద్దిగా కలబంద గుజ్జును వెంటుక్రలకు పట్టించి కండిషనర్‌లా వాడాలి. దీంతో జుట్టుకు మాయిశ్చరైజేషన్ అందించినట్టవుతుంది.
కొద్దిగా కలబంద గుజ్జు, 1 కప్పు నీరు, 1 టీస్పూన్ తేనెలను తీసుకుని మూడింటినీ మిక్సీలో వేసి బాగా తిప్పాలి. అనంతరం వచ్చే జ్యూస్‌ను నిత్యం సేవిస్తే వాపులు తగ్గిపోతాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీర్యాడికల్స్ నాశనమవుతాయి. కణజాలాలను నాశనం కూడా చూస్తుంది. నిత్యం మన శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయి. గుండెల్లో మంట, ఛాతిలో నొప్పి, మింగడంలో ఇబ్బందిగా ఉండడం, గ్యాస్ వంటి సమస్యలను అలోవెరా జ్యూస్ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. అలోవెరా జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి తెస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండడం చేత కలబంద గుజ్జును టూత్‌పేస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది దంత సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
నైట్రిక్ ఆక్సైడ్, సైటోకిన్స్ అనే పదార్థాల తయారీని అలోవెరా ప్రోత్సహిస్తుంది. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి అలోవెరాకు ఉంది. యాంటీ ట్యూమర్, యాంటీ క్యాన్సర్ గుణాలు కలబందలో పుష్కలంగా ఉన్నాయి.