Acidity : ఎసిడిటీ.. కడుపులో మంట.. ఎలా పిలిచినా సరే.. ఇది వచ్చిందంటే చాలు.. తీవ్రమైన అవస్థ కలుగుతుంది. కడుపులో మంటగా ఉంటే సహించదు. ఏమీ తినలేం. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా వాము గింజల పొడి, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకోవాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తాగుతుంటే చాలు.. కడుపులో మంట నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
2. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల తేనె కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తాగాలి. తేనె సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. అందువల్ల కడుపులో మంట తగ్గుతుంది.
3. ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల జీలకర్ర వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో కడుపులో మంట తగ్గిపోతుంది.
4. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో పాలు చల్లగా మారుతాయి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది.
5. రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.