Gas Trouble : గ్యాస్ ట్రబుల్.. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడే వారు చాలా మంది ఉండే ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుంది అని చెప్పవచ్చు. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గ్యాస్ ట్రబుల్ సమస్య తలెత్తుంది. ఈ కాలంలో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పని చేయడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, తిన్న ఆహారాన్ని కూడా సరిగ్గా నమలలేకపోవడం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుకు లోను కావడం, నిద్ర లేమి, జీర్ణాశయంలో ఇన్ ఫెక్షన్ లు వంటి వాటిని గ్యాస్ ట్రబుల్ సమస్య తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు.
అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. అలాగే త్రేన్పులు ఎక్కువగా వస్తాయి. ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గ్యాస్ సమస్య తలెత్తడానికి మరికొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహారాన్ని ఎక్కువగా సేపు నమలకుండా త్వరగా మింగేయడం, మాట్లాడుతూ తినడం, నోరు ఎక్కువగా తెరిచి తినడం, ధూమపానం, మద్యపానం వంటి కారణాల చేత కూడా గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆహార నాళంలో జీర్ణం కాని చక్కెరలను పెద్ద ప్రేగులోని బ్యాక్టీరియా గ్రహించి గ్యాస్ ను విడుదల చేస్తుంది.
గ్యాస్ సమస్య తలెత్తగానే చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే గ్యాస్ సమస్యను తగ్గించే పొడులను, సిరప్ లను తాగుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికి వీటిని అతిగా వాడడం అంత మంచిది కాదు. ఇంటి చిట్కాలను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా గ్యాస్ ట్రబుల్ సమస్యను మనం తరిమి వేయచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ చిట్కాలను తయారు చేసుకోవడం, వాడడం కూడా చాలా సులభం. గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక కప్పు వేడి పాలల్లో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుండి వెంటనే ఉపవమనం కలుగుతుంది.
అదే విధంగా మజ్జిగలో చిటికెడు వామును, చిటికెడు నల్ల ఉప్పును కలుపుకుని తాగడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుండి ఇట్టే బయటపడవచ్చు. గ్యాస్ సమస్యను తగ్గించడంలో మనకు వెల్లుల్లి రెబ్బలు ఎంతగానో ఉపయోగపడతాయి. వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వల్ల లేదా వాటి రసాన్ని తాగడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు అల్లం ముక్కలను నమిలి తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిని నేరుగా తినలేని వారు నీటిలో అల్లం ముక్కలను, సోంపు గింజలను, వామును వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని తాగిన కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అదే విధంగా పుదీనా ఆకులను మరిగించిన నీటిని తాగిన కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి గ్యాస్ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.