ప్రస్తుత కాలంలో వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. మనల్ని వేధిస్తున్న జుట్టు సంబంధిత సమస్యల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. పూర్వకాలంలో పెద్దవారిలో మాత్రమే మనం ఈ సమస్యను చూసే వాళ్లం. కానీ ప్రస్తుత తరుణంలో పిల్లల్లో కూడా తెల్ల జుట్టు రావడాన్ని మనం గమనించవచ్చు. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, మారిన జీవన విధానం, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు వంటి వాటిని మనం తెల్ల జుట్టు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా లభించే పదార్థాలను ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చే హెయిర్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, 2 టేబుల్ స్పూన్ల గుంటగలగరాకు (భృంగరాజ్) మొక్క సమూల పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో పెరుగును, కలబంద గుజ్జును వేసి కలపాలి. తరువాత గుంటగలగరాకు మొక్క సమూల పొడిని వేసి అన్నీ కలిసేలా మరోసారి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పూర్తిగా పట్టించాలి. ఇలా పట్టించిన 30 నిమిషాల తరువాత హెర్బల్ షాంపుతో లేదా రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం వంటి ఇతర జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యలు లేనివారు కూడా ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.