Athi Madhuram Benefits : ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మొక్కలల్లో అతి మధురం మొక్క కూడా ఒకటి. దీనినే ములేతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి మధురం మొక్క వేరును మనం ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మొక్క వేరు మరియు వేరు పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది. ఎంతో కాలంగా ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అతి మధురాన్ని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా అతి మధురం మనకు సహయపడుతుంది.
అతి మధురం వేరుతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అతిమధురం వేరుతో టీని తయారు చేసి రోజుకు 2 నుండి 3 సార్లు తీసుకోవచ్చు. అలాగే నీటిలో అతిమధురం వేరును వేసి బాగా మరిగించాలి. తరువాత ఈనీటితో ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఊపిరి తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే అతిమధురం టీని భోజనం చేసిన తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. వివిధ రకాల జీర్ణ సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఈ టీని తాగడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే అతిమధురం వేరుతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అతిమధురం మొక్క నుండి నూనెను కూడా తీస్తారు. ఈ నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే గిన్నెలో తేనె, పెరుగు, అతిమధురం పొడి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతాయి. ఈ విధంగా అతిమధురం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.