శిరోజాల సమస్యలు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

శిరోజాలు ప్రకాశవంతంగా ఉంటేనే ఎవరికైనా సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో తిరిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. శిరోజాల అలంకరణకు అందుకనే ప్రతి ఒక్కరూ చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో చిన్న వయస్సులోనే అనేక శిరోజాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలను పాటిస్తే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…

ayurvedic remedies for healthy hair

1. శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, పాలు, పండ్లు, చేపలు తదితర ఆహారాలను ఎక్కువగా తినాలి. దీని వల్ల కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. దీంతో శిరోజాల సమస్యలు తగ్గుతాయి. అలాగే విటమిన్‌ ఎ, డి, ఇ లు ఉండే ఆహారాలను కూడా అధికంగా తీసుకోవాలి.

2. మొలకెత్తిన శనగలు, పెసలు, కందులను తినడం వల్ల కూడా శిరోజాల సమస్యలు తగ్గుతాయి. గోధుమలు, వేరుశెనగలు, నువ్వులను కూడా తీసుకోవచ్చు. వీటిని మొలకెత్తించకుండానే రోజూ తినవచ్చు. దీని వల్ల కూడా శిరోజాల సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. కరివేపాకును నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ప్రతి రోజు గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకోవాలి. దీని వల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తినాలి. వాటిల్లో ఉండే పోషకాలు శిరోజాలను దృఢంగా మారుస్తాయి.

4. అవిసెనూనెలో తగినంత నిమ్మరసం కలిపి జట్టుకు రాసి తరువాత రోజు తలస్నానం చేయాలి. శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా మారుతాయి.

5. కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి తలకు బాగా మర్దనా చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి.

6. గుడ్డుసొనలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు బాగా రాయాలి. ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.

7. కుంకుడుకాయ పొడిలో గుమ్మడి కాయ విత్తనాల చూర్ణం, శీకాయ పొడి కలిపి జుట్టుకు బాగా రాయాలి. తరువాత కొంత సేపు ఆగి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి.

8. పెసరపిండి, మెంతి పిండిని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రుద్ది తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. దీని వల్ల శిరోజాలు అందాన్ని సంతరించుకుంటాయి.

9. గుంటగలగరాకును కొబ్బరినూనెలో బాగా వేయించాలి. తరువాత ఆ నూనెను తలకు రాయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు నల్లబడుతాయి.

10. జాజిపూలు, మందారం పువ్వులను సమపాళ్లలో తీసుకుని కషాయం కాచి దాంట్లో తగినంత కొబ్బరినూనె కలిపి మరిగించాలి. చల్లారాక ఆ నూనెతో తలకు బాగా మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

11. కుంకుమ పువ్వును నీళ్లలో బాగా మరిగించాలి. చల్లారాక శిరోజాలకు మర్దనా చేసి కొద్ది సేపటి తరువాత నీళ్లతో తడిపితే జుట్టు ఎరుపు రంగులోకి మారుతుంది. సహజసిద్ధంగా జుట్టుకు ఈ విధంగా రంగు మార్చవచ్చు. అలాగే కప్పు మెత్తగా చేసిన గోరింట, టీస్పూన్‌ చొప్పున గుంటగలగరాకు, నీలి ఆకుల పొడి, మెంతి పొడి కలిపి హెన్నాలా పెట్టుకోవాలి. గంటయ్యాక స్నానం చేస్తే జుట్టుకు నల్లని రంగు వస్తుంది.

12. చామంతి పూలను, నీలి ఆకులను నీళ్లలో మరిగించి తలకు రాస్తే జుట్టు నల్లగా కనిపిస్తుంది.

సూచన – పైన చిట్కాలను పాటించడానికి ముందు శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేయాలి. రంగు తలకు పట్టాక శుభ్రమైన నీటితో కడగాలి. అలాగే వీటిని తరచూ ఉపయోగించాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts