సాధారణంగా మనలో అధిక శాతం మంది అరటి పండ్లను తిని తొక్క పారేస్తుంటారు. నిజానికి అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. వాటి తొక్కలను తినడం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండు తొక్కలను ఎవరైనా తింటారా..? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయినా ఇది నిజమే. ఎందుకంటే.. అరటి పండు తొక్కలను తినడం వల్ల మనకు లాభాలు కలుగుతాయని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. అందువల్ల ఈ సారి మీరు అరటి పండ్లతోపాటు వాటి తొక్కలను కూడా తినే ప్రయత్నం చేయండి. దాంతో కింద తెలిపిన ప్రయోజనాలు పొందవచ్చు.
- అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రోజూ మర్దనా చేసినట్లు రాస్తుండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు పోతాయి.
- కళ్లు బాగా వాపులకు గురైనట్లు కనిపిస్తుంటే వాటిపై అరటి పండు తొక్కలను కొంత సేపు ఉంచి కళ్లు మూసుకోవాలి. తరచూ ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
- చలికాలంలో సహజంగానే మన చర్మం పగులుతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు అరటి పండు తొక్కలను చర్మంపై రాయాలి. దీంతో చర్మానికి తేమ అందుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
- మొటిమలపై నిత్యం అరటి పండు తొక్కలను మర్దనా చేసినట్లు రాస్తుంటే కొద్ది రోజులకు మొటిమలు పోతాయి.
- సోరియాసిస్ ఉన్నవారికి అరటి పండు తొక్కలు ఎంతగానో మేలు చేస్తాయి. సోరియాసిస్ ఉన్న ప్రదేశంలో అరటి పండు తొక్కలను రాస్తుంటే తేమ అందుతుంది. దీంతోపాటు దురద తగ్గుతుంది.
- పులిపిరి కాయలపై అరటి పండు తొక్కను ఉంచి పైన టేప్ వేయాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు తీస్తే పులిపిరికాయలు పోతాయి.
- అరటి పండు తొక్కల్లో శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని 2018లో కొందరు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల అరటి పండు తొక్కతో గాయాలను త్వరగా మాన్పించుకోవచ్చు.
- అరటి పండు తొక్కలో కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్ అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయని 2011లో సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి.
- అరటి పండు తొక్కలను జుట్టు కుదుళ్లకు బాగా రాసి కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి.
- అరటి పండు తొక్కలతో దంతాలను నిత్యం శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారుతాయి. ఈ విషయాన్ని 2015లో సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
- ఎండ వల్ల కందిన చర్మంపై, దద్దుర్లు, దురదలు వచ్చినా చర్మంపై అరటి పండు తొక్కను రాస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- అరటి పండు తొక్కలు రెండు తీసుకుని వాటిని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డ కట్టించాలి. అనంతరం వాటిలో నుదుటిపై ఒక తొక్క, మెడపై ఒక తొక్కను ఉంచాలి. దీంతో కొంత సేపట్లోనే తలనొప్పి తగ్గుతుంది.
- చర్మంపై ఎక్కడైనా ముళ్లు లేదా చిన్నపాటి పదునైన వస్తువులు గుచ్చుకున్నప్పుడు అవి బయటకు రాకపోతే వాటిపై అరటి పండు తొక్కను ఉంచాలి. అనంతరం 15 నిమిషాల తరువాత వాటిని సులభంగా బయటకు తీయవచ్చు. అరటి పండు తొక్క తీస్తే ముళ్లు బయటకు వస్తాయి.
- అరటి పండు తొక్కలను ఉపయోగించి ఇంట్లో పెంచుకునే మొక్కల ఆకులను శుభ్రం చేయవచ్చు. లెదర్ షూస్, వెండి వస్తువులను కూడా శుభ్రం చేయవచ్చు.
- అరటి పండు తొక్కలతో సేంద్రీయ ఎరువు తయారు చేసి దాంతో తోటలోని మొక్కలను పెంచవచ్చు.
అయితే అరటి పండు తొక్కలను నేరుగా తినలేమని అనుకునే వారు వాటితో టీ పెట్టుకోవచ్చు. లేదా వాటిని చట్నీ కింద తయారు చేసుకుని తినవచ్చు. స్మూతీలు తయారు చేసుకుని తాగవచ్చు. లేదా ఇతర పదార్థాలతో కలిపి తినవచ్చు. ఎలా తిన్నా వాటితో మనకు లాభాలే కలుగుతాయి.