Aloe Vera For Beauty : మనకు సులభంగా లభించే కలబందతో కొన్ని రకాల చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇది మన శరీర ఆరోగ్యంతో పాటు చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా కలబందను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మం పై మొటిమలను నివారించడంలోచ చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించడంలో, చర్మాన్ని పొడిబారకుండా కాపాడడంలో కలబంద మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలలో, జుట్టు కాంతివంతంగా కనిపించడంలో, జుట్టు చిట్లడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా కలబంద తోడ్పడుతుంది.
బయట లభించే రసాయనాలు కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడానికి బదులుగా కలబందతో కొన్ని ఇంటి చిట్కాలు తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం మరింయు జుట్టు ఆరోగ్యానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చర్మ ఆరోగ్యానికి కలబందను ఎలా వాడాలో తెలుసుకుందాం. కలబందతో మాస్క్ ను వేసుకోవడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. దీని కోసం 2 టీ స్పూన్ల కలబంద గుజ్జులో, 2 టీ స్పూన్ల పంచదార, ఒక టీ స్పూన్ పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల కలబంద గుజ్జులో 2 టీ స్పూన్ల టమాట గుజ్జు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగివేయాలి.
ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన ట్యాన్, నలుపుదనం తొలిగిపోతుంది. ముఖంపై ఉండే ముడతలు తొలగిపోవాలనుకునే వారు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, అర టీ స్పూన్ బాదంనూనె వేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే 4 టీ స్పూన్స్ కలబంద గుజ్జులో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ఈ విధంగా కలబందను వాడడం వల్ల చక్కటి ఆరోగ్యమైన అందమైన చర్మాన్ని పొందవచ్చు. ఇక జుట్టు ఆరోగ్యానికి కలబందను ఎలా వాడాలో తెలుసుకుందాం. కలబందతో నూనెను తయారు చేసి వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
దీని కోసం 2 టీ స్పూన్ల కలబంద గుజ్జులో 2 టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగాకలపాలి. తరువాత ఈ నూనెను జుట్టు కుదళ్లలోకి ఇంకేలా బాగా పట్టించాలి. దీనిని ఒకటి లేదా రెండు గంటలపాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల కలబంద గుజ్జు, 3 చుక్కల రోజ్ మేరీ ఆయిల్, 2 టీ స్పూన్ల నీళ్లు కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఇది హెయిర్ సీరంలా పని చేస్తుంది. ఇక జుట్టు చిట్లడం వంటి సమస్యలతో బాధపడే వారు 3 టీ స్పూన్ల కలబంద గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దీనిని జుట్టు చివర్లకు రాసి అరగంటపాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. వారానికి 3 నుండి 4 సార్లు ఇలా చేయడం వల్ల మంచిఫలితం ఉంటుంది.