Natural Face Pack : వాతావరణ కాలుష్యం, ఎండవేడి, మారిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక చర్మ సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. దీంతో మన ముఖం అందవిహీనంగా తయారయ్యి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు, ముఖం నల్లగా మారడం వంటి అనేక సమస్యలతో బాధపడే వారి సంఖ్య నేటి తరుణంలో ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక చక్కటి ఇంటి చిట్కాను ఉపయోగించి మనం ఈ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ చిట్కాను వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గి ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని అందంగా మార్చే ఈ ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం శనగపిండిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల పెరుగును వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దీనిని ముఖం పై వృత్తాకారంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా వేసుకోవచ్చు.
ఆ చిట్కాను క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు పాటించడం వల్ల ముఖం ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారడంతో పాటు చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఎండవల్ల నిర్జీవంగా మారిన చర్మం కూడా తేమను సొంతం చేసుకుంటుంది. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. బయట దొరికే క్రీములను, ఫేస్ వాష్ లను, స్క్రబర్ లను అలాగే ఇతర సౌందర్య ఉత్పత్తులను అధిక ధరలకు కొనుగోలు చేసి వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే పదార్థాలతో మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఈచిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మన ముఖం కాంతివంతంగా తయారవుతుంది.