Coconut Oil For Face : మనలో చాలా మంది ముఖంపై మచ్చలు, ముడతలు, మృతకణాలు పేరుకుపోవడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా నేటి తరుణంలో యువత ఈ సమస్యలతో మరీ ఎక్కువగా బాధపడుతున్నారు. మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తొలగిపోయి ముఖం అందంగా కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు కొబ్బరి నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలా మంది కొబ్బరి నూనె అనగానే జుట్టుకు మాత్రమే మేలు చేస్తుందని భావిస్తారు. కానీ కొబ్బరి నూనె మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె ఎంతో దోహదపడుతుంది. చర్మంపై ఉండే మచ్చలను, ముడతలను తొలగించి ముఖం అందంగా, కాంతివంతంగా కనబడేలా చేయడంలో కొబ్బరి నూనె మనకు ఉపయోగపడుతుంది. అయితే కొబ్బరి నూనెను ఎలా వాడడం వల్ల మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి.
తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను తరుచూ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేసి ముఖానికి బాగా పట్టించాలి. తరువాత నూనె చర్మంలలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు నుండి నాలుగు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోతాయి. ఈ విధంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల మనం చక్కటి చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.