కొబ్బరినూనెను నిత్యం సేవించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అందరికీ తెలుసు. అయితే కొబ్బరినూనె అనేది శరీరం కన్నా జుట్టుకు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు సమస్యలకు ఆ నూనె పవర్‌ఫుల్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె వల్ల ఏయే జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* నిత్యం బాగా ఎండలో తిరిగేవారికి అనేక జుట్టు సమస్యలు వస్తుంటాయి. అయితే ఎండలో తిరుగుతాం అనుకునేవారు కొబ్బరినూనె నిత్యం తలకు రాసుకోవడం మంచిది. దీంతో ఎండ నుంచి జుట్టుకు రక్షణ లభిస్తుంది. కొబ్బరినూనె సహజసిద్ధమైన రక్షణను జుట్టుకు అందిస్తుంది. దాదాపుగా 10 పొరల్లో ఆ నూనె జుట్టుపై ఉంటుంది. దీంతో ఎండ జుట్టును ఏమీ చేయలేదు. వెంట్రుకలు ఎండ నుంచి సురక్షితంగా ఉంటాయి.
* వెంట్రుకలు పొడిబారిపోయే సమస్యకు కొబ్బరినూనె చక్కని పరిష్కారం చూపుతుంది. దీన్ని నిత్యం తలకు రాసుకుంటే చాలు, జుట్టు ఎప్పుడూ తేమగా, మృదువుగా ఉంటుంది.
* కొబ్బరినూనెను నిత్యం తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య ఉండదు. దీంతోపాటు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కొబ్బరినూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టులో సూక్ష్మ క్రిములను చేరకుండా చూస్తాయి.
* కొందరికి కొన్ని రకాల షాంపూలు పడవు. దీంతో ఆ షాంపూలతో తలస్నానం చేశాక జుట్టు కుదుళ్లు పొడిబారతాయి. ఈ సమస్యకు కొబ్బరినూనె పరిష్కారం చూపుతుంది. అందుకు గాను జుట్టు కుదుళ్లకు తగిలేలా కొబ్బరినూనెను రాయాలి. దీంతో జుట్టు కుదుళ్లు కూడా మృదువుగా మారుతాయి.
* మార్కెట్‌లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్ కన్నా సహజసిద్ధంగా లభించే కొబ్బరినూనెను వాడడం జుట్టుకు ఎంతగానో శ్రేయస్కరం. దీంతో జుట్టు దృఢంగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.
– డాక్టర్ అపర్ణ సంతానం
డెర్మటాలజిస్టు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365